10 August, 2026 | 3:47 AM

మెడికో ప్రియాంక మృతి

10-08-2026 12:58 AM

ఈ నెల 3న రాజమండ్రిలో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన యువకులు

తీవ్రంగా గాయపడిన ప్రియాంక

రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలింపు

అక్కడి చికిత్స పొందుతూ మృతి

ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా

కారులో ఉన్న ఇద్దరి నిందితుల అరెస్టు

నిందితులపై కఠిన చర్యలు: ఏపీ సీఎం చంద్రబాబు

రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సికింద్రాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఏపీలోని రాజమండ్రిలో ఈ నెల 3న మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణలోని గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక.. ఎంబీబీఎస్ పూర్తిచేసి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

అయితే ఈ నెల 3న రాజమండ్రి ప్రసాద్ ఆదిత్యమాల్‌లో తన మిత్రుడు ఉమేష్‌తో కలిసి ప్రియాంక సినిమా చూసింది. అనంతరం ఇద్దరు కలిసి బైక్‌పై బయల్దేరారు. ఇంతలోనే మాల్ హాలు గేటు వద్ద వెనక నుంచి వచ్చిన కారు వీరి బైక్‌ను రెండుసార్లు ఢీకొట్టింది. మూడోసారి బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తలకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందారు. సురవరపు దస్వంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌లు మద్యంమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను ప్రమాదానికి ముందు మద్యం మత్తులో మాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వారు కారులో అక్కడి నుంచి వెళ్లూ.. ప్రియాంకను ఢీకొట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో కారు స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు కనిపించింది. ఉమేష్‌కు కూడా గాయాలు అయ్యాయి. ప్రియాంక మెదడుకు అయిన తీవ్ర గాయాల కారణంగా పరిస్థితి విషమించింది.

తర్వాత కిమ్స్ వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక మృతిచెందినట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దస్వంత్-- కారు నడిపగా, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ అతనితో కారులో ఉన్నట్టు గుర్తించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

రాజమండ్రిలో నేడు విద్యాసంస్థల బంద్

డాక్టర్ ప్రియాంక విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ సోమవారం రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ప్రియాంకను యాక్సిడెంట్ చేసిన తర్వాత మూడు రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రియాంక చికిత్స పొందుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మంత్రి అనితా ఎవరూ కూడా కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. 

హత్య కేసు పెట్టాలి: ప్రియాంక తండ్రి

ఈ సందర్భంగా మీడియా ముందు ప్రియాంక తండ్రి వెంకటేష్ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తన కూతురు గురించి పట్టించుకోలేదని వాపోయారు. జిల్లా అధికారులు కూడా గురించి మాట్లాడలేదని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై హత్యకేసు నమోదు చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి కఠినం గా శిక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రియాంక మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  నిర్లక్ష్యంతో కారు నడిపిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని చెప్పారు. పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. మెడికో ప్రియాంక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.