మరో రెండు బొగ్గు గనులివ్వండి
- ‘కోయగూడెం ఓసీ 3, జేవీఆర్ ఓసీ3’ని సింగరేణికి కేటాయించాలి
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఏబీకేఎంఎస్ నేతల వినతి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కోయగూడెం ఓసీ 3, జేవీఆర్ ఓసీ 3 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఏబీకేఎంఎస్ సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం వల్ల కొత్త గనులు రాలేదని, దీంతో ఈ ఏడాది సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే పరిస్థితి ఏర్పడిందని సంఘం నాయకులు మంత్రికి వివరించారు.
ప్రైవేట్ పరం చేసిన ఈ రెండు గనుల్లో భూసేకరణ సమస్యలు, చట్టపరమైన వివాదాలు, గిరిజన ఏజెన్సీ నిబంధనల కారణంగా ఇప్పటివరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. కొత్త గనులు లేక ఇల్లందు ప్రాంతంలో కార్మికుల బదిలీలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉపాధి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, యంత్రాలు, రవాణా వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, బొగ్గు ఉత్పత్తి పెరిగి దక్షిణ భారత విద్యుత్ కేంద్రాలకు నిరంతర సరఫరా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
కార్మికులకు ఉద్యోగ భద్రత, స్థానిక ప్రజలకు ఉపాధి దక్కుతుందని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కేటాయింపులపై సమగ్ర సమీక్ష జరిపి, అవసరమైతే డీ-అలోకేషన్ చేసి, పునఃకేటాయింపు లేదా పునఃవేలం ద్వారా ఈ రెండు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రికి విన్నవించారు. మణుగూరు పీకేఓసీ డిప్‌సైడ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టును సింగరేణికి దక్కేలా చొరవ తీసుకున్నందుకు మంత్రి కిషన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలతు తెలిపారు .కార్యక్రమంలో సంఘాల నాయాకులు పి. మాధవనాయక్, పులి రాజారెడ్డి, అప్పాని శ్రీనివాస్, వడ్డేపల్లి కుమార్ స్వామి, యాదగిరి సత్తయ్య, జీవీ కృష్ణారెడ్డి, సాయి వేణి సతీష్, లీలా కృష్ణ, సుజేందర్, నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.






