10 August, 2026 | 3:46 AM

బ్రాహ్మణ సమాజం ఏకంకావాలి

10-08-2026 12:58 AM
  1. కరివెన అన్నదాన యజ్ఞంలో భాగస్వాములు కావాలి
  2. పిలుపునిచ్చిన బ్రాహ్మణ ప్రముఖులు 
  3. గోపన్‌పల్లి బ్రాహ్మణ సంక్షేమ భవనంలో ఆత్మీయ సమ్మేళనం
  4. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం 

శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): బ్రాహ్మణ సమాజం తన సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏకతాటిపై నిలిస్తే సాధించలేనిది ఏదీ లేదని, ఎలాంటి అభివృద్ధి అయినా సాధ్యమేనని బ్రాహ్మణ ప్రముఖులు, పెద్దలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలో విశేష గుర్తింపు పొందిన కరివెన నిత్యాన్నదాన సత్రాల మహాయజ్ఞంలో ప్రతి బ్రాహ్మణుడూ భాగస్వామి అయి తనవంతు సేవ అందించాలని స్పష్టం చేశారు.

ఆదివారం హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి బ్రాహ్మణ సంక్షేమ భవనంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం హాజరయ్యారు.

కేంద్ర మంత్రి అశ్వినీకుమార్ మాట్లాడుతూ.. ‘ప్రతి బ్రాహ్మణుడు రోజువారీ జీవితంలో ధర్మాచరణపై దృష్టి సారించాలి. శ్రీశైలం, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలు అందిస్తున్న నిత్యాన్నదాన సేవలు అభినందనీయం. ఈ సత్రాల విస్తరణకు, అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అన్ని సహకారాలు అందించేందుకు నేను నా వంతు కృషి చేస్తాను’ అని అన్నారు.

ఐక్యతతోనే ఏ లక్ష్యమైనా సాధ్యం 

తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సమాజంలో బ్రాహ్మణులు ఐక్యంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కరివెన సత్రాల నిర్వహణకు, బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన మద్దతు లభించేలా చూస్తాం’ అన్నారు. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను పరిరక్షించడంలో బ్రాహ్మణులది ప్రధాన పాత్ర. కరివెన సత్రాల సేవలు నిరంతరం కొనసాగేందుకు నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

డాక్టర్ ఎన్ వేణుగోపాల్ (సత్రాల కార్యదర్శి) నివేదికను సమర్పిస్తూ సత్రాల ప్రస్తుత నిర్వహణ, నిధుల వినియోగం, రాబోయే రోజుల్లో భక్తులకు కల్పించబోయే అధునాతన వసతులు, విస్తరణ ప్రణాళికలను సభకు వివరించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి సత్రం కమిటీ అధ్యక్షుడు ఎన్.ఆర్. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో హర్కరే శ్రీనివాస్ (సలహామండలి చైర్మన్), కామరాజు నరేంద్ర (అధ్యక్షులు), గోపాలుని హరిహరరావు (కోశాధికారి), చిదంబరరావు, కాళంరాజు రామకృష్ణ (సహాయ కార్యదర్శులు), పారిశ్రామికవేత్తలు  ప్రముఖులు ప్రదీప్, మైలవరపు శ్రీనివాసరావు, గజల్ శ్రీనివాస్, ఎస్.వి. రావు, సీతారామయ్య, మనోహర్, ప్రభాకర్, మూర్తి, అడవి రాంబాబు, చింతపల్లి సుబ్రహ్మణ్యం, కలగ రాఘవ, నగరంలోని వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

కరివెన సత్రాల ప్రాముఖ్యత

దశాబ్దాల ఆధ్యాత్మిక సేవ: శ్రీశైలం క్షేత్రంలో ప్రారంభమైన కరివెన నిత్యాన్నదాన సత్రం, లక్షలాది మంది యాత్రికులు, భక్తులకు ఉచిత అన్నదానం, వసతి సౌకర్యాలు కల్పిస్తూ దక్షిణ భారతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు ఆకలి తీర్చడమే పరమధర్మంగా భావించి, ప్రతి కుటుంబం ఈ అన్నదాన యజ్ఞంలో సభ్యత్వాన్ని పొంది తమ మద్దతు తెలపాలని నిర్వాహకులు కోరారు.