25 March, 2026 | 1:52 AM

పాల్వంచ జాతీయ రహదారిపై మృత్యుపాశం

25-03-2026 12:17 AM

కేబుల్ గుంతలతో వాహనదారుల విలవిల!

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24 (విజయక్రాంతి): పాల్వంచ -- భద్రాచలం జాతీయ ప్రధాన రహదారిపై పాల్వంచ పట్టణంలో ఒక ప్రైవేట్ నెట్వర్క్ సంస్థ తవ్విన భారీ గుంత  వాహనదారుల పాలిట యమపాశంగా మారింది. కేబుల్ పనుల కోసం రోడ్డును తవ్విన సదరు సంస్థ, పని పూర్తయిన తర్వాత ఆ గుంతను పూడ్చకుండా వదిలేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాల నిలయంగా ప్రధాన రహదారి..

ఈ రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ గుంత సరిగ్గా కనిపించకపోవడంతో వాహనాలు అదుపుత కిందపడుతున్నారు. ఇప్పటికే పలువురు గాయపడ్డారు. శ్రీరామనవమి సమీపిస్తున్న వేళ మరింత రద్దీ పెరగనుంది. దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచల పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రధాన మార్గం కావడం గమనార్హం. ఈ నెల 26న శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో, వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వాహనాల ద్వారా ఈ రోడ్డు గుండా భద్రాద్రికి చేరుకుంటారు. ఇంతటి కీలక సమయంలో రోడ్డుపై ఇలాంటి ప్రమాదకర గుంతలు ఉండటం భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

అనుమతులు ఉన్నాయా?..

జాతీయ రహదారిపై ఇలాంటి పనులు చేపట్టాలంటే జాతీయ రహదారి (ఎన్.హెచ్ )అధికారుల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి. అసలు ఈ నెట్వర్క్ సంస్థకు అనుమతులు ఉన్నాయా? లేదా? అన్నది అనుమానంగా మారింది.

నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు..

ఈ సమస్యపై పర్యవేక్షించాల్సిన జాతీయ రహదారి అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ‘కేబుల్ సంస్థలు తమ లాభం కోసం రోడ్లను ఇష్టారీతిన తవ్వి వదిలేస్తున్నాయి.  రాత్రిపూట ఇక్కడ ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఈ గుంతను పూడ్పించి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.