25 March, 2026 | 1:49 AM

సుప్రీం తీర్పుతో మత మార్పిడులకు చెక్

25-03-2026 12:19 AM
  1. తీర్పును స్వాగతించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 
  2. అర్హులైన ఎస్సీలకు న్యాయం జరుగుతుందని వెల్లడి

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): మతం మారినవారు ఎస్సీ రిజర్వేషన్లు, ఇతర రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందలేరంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును బీజేపీ పక్షాన తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి గట్టి రక్షణ లభించిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాజ్యాంగంలో కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లు హిందూ సమాజంలోని అణగారిన వర్గాల సామాజిక అభివృద్ధి కోసమే ఉద్దేశించినవని, ఒకసారి మతం మారిన తర్వాత, అదే సామాజిక హోదాతో హక్కులను క్లెయిమ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం హర్షణీయమన్నారు. కొంతకాలంగా కొందరు మత మార్పిడిలకు పాల్పడుతూనే, అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్ల వాటాను పొందుతున్నారని, దీనివల్ల నిజమైన దళిత బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ తీర్పుతో అక్రమాలకు అడ్డుకట్ట పడి, నిజమైన అర్హులైన ఎస్సీలకు న్యాయం జరుగుతుందని తాను బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు.