calender_icon.png 3 May, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు

03-05-2025 02:36:09 AM

  1. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో.. 
  2. తదుపరి విచారణ 8కి వాయిదా

న్యూఢిల్లీ, మే 2: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శుక్రవారం ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. సోనియా, రాహుల్‌కు నోటీసులు ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు గతంలో నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించినా.. ఈడీ అధికారులు అవసరమైన పత్రాలు సమర్పిం చడంతో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

‘భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 223 ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించే హక్కు కలిగి ఉంటారు. ఇది బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 223 ఇచ్చే ప్రత్యేక హక్కు. తదుపరి విచారణ కోసం ఈ హక్కు కీలకం.’ అని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును మే 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

ఈడీ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రస్తుత దశలో నోటీసుల జారీకి ఈడీ వ్యతిరేకం కాదని, న్యాయపరమైన విచారణ సూత్రాలకు మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు. 2014లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు స్వీకరించిన అనంతరం 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ పత్రిక మాతృసంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) మీద, ఎటువంటి లాభాపేక్ష లేని యంగ్ ఇండియా కంపెనీ అందులో సోనియా, రాహుల్‌కు 38శాతం వాటాలు ఉండటం కూడా ఆరోపణలకు కారణం అయింది. ఏజేఎల్‌కు చెందిన రూ. 2 వేల కోట్ల రియల్ ఎస్టేట్స్ ఆస్తులను అక్రమ మార్గాల్లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 50లక్షలకే బదిలీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఏజేఎల్‌కు చెందిన రూ. 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, లక్నో తదితర ప్రాంతాల్లో ఏజేఎల్ ఆస్తులున్న భవనాలకు నోటీసులు అంటించినట్టు వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కూడా అందులో భాగమేనని వాదిస్తోంది.