04-07-2025 12:02:00 AM
- పాత వాహనాలకు ఇంధన నిషేధంపై వెనకడుగు
- ప్రజల వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన సర్కార్
- 62 లక్షల వాహన యజమానులకు ఊరట
న్యూఢిల్లీ, జూలై 3: కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిషేధించాలని తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం యూటర్న్ తీసుకుంది. పాత వాహనాలను గుర్తించి వాటికి ఇంధనం నిలిపివేసే వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణలో సాధ్యం కాదని పేర్కొంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వెల్లువెత్తడంతో నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాలకు ఇంధనం నిలిపివేసే ఆదేశాల అమలును తక్షణమే నిలిపివేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు (సీఏక్యూఎమ్) లేఖ రాసింది. ఈ నిర్ణయం తో ఢిల్లీలో సుమారు 62 లక్షల వాహన యజమానులకు ఊరట కలిగినట్టయింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. సాంకేతిక సవాళ్లు, సం క్లిష్ట వ్యవస్థల కారణంగా అమలు చేయడం కష్టతరమన్నారు. అందుకే పాత వాహనాలకు ఇంధన నిషేధం అమలును నిలిపివే యాలంటూ కమిషన్‌కు లేఖ రాసినట్టు తెలిపారు.
ఎన్‌సీఆర్ వ్యాప్తంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకు దీన్ని నిలిపివేయాలని కోరినట్టు వెల్లడించారు. ఇక దేశ రాజధానిలోకాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. కాలం చెల్లిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయకూడదని నిర్ణయించింది. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిలిపివేయాలన్న నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.