04-07-2025 12:04:02 AM
- డాబర్ కంపెనీపై వ్యతిరేక ప్రకటనలు ఆపాలని ఆదేశాలు
- తమ ఉత్పత్తులను అవమానిస్తోందంటూ పిటిషన్ దాఖలు
- జూలై 14న తదుపరి విచారణ
న్యూఢిల్లీ, జూలై 3: బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ టార్గెట్‌గా పతంజలి కంపెనీ చేస్తున్న వ్యంగంతో కూడిన ప్రకటనలను తక్షణమే నిలిపేయాలని కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పతంజలి సంస్థ తమ ఉత్పత్తుల్లో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఒకదాని గురించి అవమానకరమైన ప్రకటనలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ డాబర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయుర్వేద, శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చ్యవన్‌ప్రాష్‌ను తయారు చేసిన ఏకైక సంస్థ తమదేనని పతంజలి పేర్కొంటుంది. డాబర్ వంటి ఇతర బ్రాండ్‌లకు ప్రామాణికమైన జ్ఞానం లేదని, అందువల్ల సరిగ్గా ఉత్పత్తులు, యాడ్స్ చేయడం లేదని వెల్లడించింది. దీంతో డాబర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వాణిజ్య ప్రకటనలను నిలిపివేయడంతో పాటు తమ పేరుకు భంగం కలిగించినందుకు రూ. 2 కోట్ల మేరకు నష్టపరిహారం ఇప్పించాలని కోరింది. తమ ఉత్పత్తే సరైనదని పతంజలి వాణిజ్య ప్రకటనల్లో తప్పుగా క్లెయిన్ చేస్తోందని ఆరోపించింది. ఈ అంశంపై న్యాయస్థానం జూలై 14న తదుపరి విచారణ చేపట్టనుంది.