26-11-2025 12:00:00 AM
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, నవంబర్ 25 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ప్రతిపక్ష నాయకులను నిలదీయాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి భిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్ వి ఫంక్షన్ హాల్ లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే నని అన్నారు. 1100 కోట్ల వడ్డీ లేని రుణాలను జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీంట్లో మూడు కోట్లకు పైగా రుణాలు కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రుణమాఫీ కింద వచ్చాయన్నారు. గతంలో 10 సంవత్సరాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలిం చిందని డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలన్నారు.
డిగ్రీలు పీజీలు చేసిన మహిళలకు ఒక ఉద్యోగం కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృ త్వంలో 80 వేల ఉద్యోగాలను నియమించామన్నారు. బి.ఆర్.ఎస్ పాలనలో 10 సంవత్సరాలలో 50 వేల పోస్టులను కూడా నియామకం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ కాంటీన్లు, వంటి వాటిని మహిళలకు అప్పగించడం జరిగిందన్నారు.
తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రైతులకు 22 కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఇది గిట్టని ప్రతిపక్షాల వారు తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీమాట్లాడుతూరాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందించిందన్నారు.
కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి రూ.3కోట్ల 25 లక్షలు నియోజకవర్గానికి సంబంధించి చెక్కులను అందజేశామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మూడో విడత అందిస్తున్నామనీ తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మాటిచ్చాం, ఇప్పుడు నిరూపిస్తున్నా మని తెలిపారు. మహిళలను వారి కాళ్ళ మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, దృఢ సంకల్పంతో ఉన్నా మన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయంగా తమ కుటుంబాలను నిలదొకుకొని చింతలేని కుటుంబం గా చేయాలని ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి సన్న బియ్యం మరియు 500 కే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వికలాంగులు, జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణ, గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు.
మహిళలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారాని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, డి ఆర్ డి ఎ పి డి సురేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఎన్నారై కాంగ్రెస్ సెల్ అధ్యక్షులు అంతంపల్లి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశాయిపేట గ్రామంలో మహిళలకు చీరల పంపిణీ..
బాన్సువాడ, నవంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ప్రభుత్వం చేపడుతున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలో ని మహిళల అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ప్రశాంత్ మాట్లాడుతూ ఏ ఒక్క మహిళా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయం. ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్వయం సహాయక సంఘాల విఓ లు అనిత హన్మండ్లు, సవిత దిగంబర్, బుక్ కీపర్ రాములు, గ్రామ పెద్దలు జయ వీరప్ప, రాధాక్రిష్ణ, యువజన నాయకులు రత్నాకర్,స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.