17-10-2025 12:00:00 AM
కార్యకర్తలు సూచించిన వారికే డీసీసీ పదవి
ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతిరౌత్లే
దరఖాస్తుల స్వీకరించిన పరిశీలకురాలు
సిద్దిపేట, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే పార్టీ లక్ష్యమని ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రౌత్లే అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పట్ల కృతజ్ఞతతో పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి, 5 సంవత్సరాలు పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసిన నాయకులకే పార్టీ పదవులు దక్కుతాయని తెలిపారు.
నామినేషన్లు స్వీకరించాక కార్యకర్తల అభిప్రాయం మేరకే పదవుల కేటాయింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగితా పార్టీలకు భిన్నంగా పనిచేస్తుందని, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన సాగిస్తుందని సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అవినీతి పేరుకుపోయిందని దానిని తుడిచి పెట్టేందుకు రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిందే నని చెప్పారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఏఐసిసి పరిశీలకులు జగదీష్, వరలక్ష్మి , రామచంద్రం, నశీర్ హుసేన్, డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి, నాయకులు గూడూరు శ్రీనివాస్ గంప మహేందర్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బోర్డు సభ్యులు డాక్టర్.సూర్య వర్మ , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.