15-05-2025 12:55:23 AM
నాగర్ కర్నూల్ మే 14 (విజయక్రాంతి): పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ నిర్మాణాల ఆక్రమణలను మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. జిల్లా కేంద్రంగా మారిన అనంతరం క్రమంగా వాహనాల రద్దీ భారీగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య తరచూ ఉత్పన్నం అవుతుందని ఆర్‌అండ్బి, మున్సిపల్, ట్రాఫిక్, పోలీసుల సంయుక్తంగా రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న వీధి విక్రయదారుల షెడ్డులను తొలగించారు.
నల్లవెల్లి రోడ్డు, హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్లను సైతం తొలగించేందుకు అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రోడ్డు పొడవునా తోపుడుబండ్లు ఇతర చిరు వ్యాపారులు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అయ్యే విధంగా వ్యవహరించవద్దని పలు సూచనలు చేశారు.
కిరాణా వర్తక వ్యాపారులు తమ దుకాణాల కంటే ఎక్కువ స్థలాన్ని కబ్జా చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొంతమంది వీధి విక్రయకారులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అనుకూలమైన వ్యక్తుల షెడ్డులను మాత్రం తొలగించడం లేదని మండిపడ్డారు. వారికి పోలీసు అధికారులు సర్ది చెప్పారు.