15-05-2025 12:54:52 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రూ.2లక్షల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టుల పనులు చేపట్టినా ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో ఒక్కటి కూడా పూర్తికాలేదని..ఆ నిధులు వరదలా పారాయని ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచించాలని రాష్ట్రంలోని మేధావులు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘వెనకటికి పెద్దలు సామెత చెప్పినట్లు గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి.. గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలి.. అలా కాదని ఒకరి పని మరొకరు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తీరు గా ఉంటుంది..’అని పేర్కొన్నారు. ఇంజినీర్లు నిర్మించాల్సిన ప్రాజెక్టులను సీఎం, మంత్రులు హెలిక్యాప్టర్ల నుంచి చూస్తూ ప్రాజెక్టుల్లో వేలు పెట్టి నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులా పరిస్థితి మారిపోతుందని, లక్ష కోట్ల ప్రజాధనం సముద్రం పాలవుతుందని సీఎం ఎద్దేవా చేశారు.
సోమాలియా నుంచి అమెరికా వరకు ప్రపంచంలో నిర్మించిన మూడేళ్లలోనే కూలిపోయిన ప్రా జెక్టు ఒక్క కాళేశ్వరం మాత్రమేనని ఆయన విమర్శించారు. బుధవారం సాయంత్రం జలమండలిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో ఎంపికైన 244 మంది ఏఈలు, 199 మంది జేటీవోలకు నియామక పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎలాంటి నియామకాలు లేని ఇరిగేషన్ శాఖలో 14నెలల్లో 1,161 మందిని నియమించామని తెలిపారు. 2వేల మంది లష్కర్లను నియమించి నీటిపారుదల శాఖను పటిష్టం చేశామన్నారు. నెహ్రూ హయాంలో కేవలం రూ.10వేల కోట్లతోనే నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరలేదని..
నిజాం పాలనలో వందేళ్ల క్రితం నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ సైతం ఎంతో పటిష్టంగా ఉన్నాయన్నారు. 2009లో వరదలు వస్తే కొట్టుకుపోతుందేమోనని అంతా భావించినా శ్రీశైలం ప్రాజెక్టు బలంగా తట్టుకుందని అన్నారు. కానీ రూ. 1 లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 3 ఏళ్లలో ఎలాంటి వరదలు లేకుండానే కుప్పకూలిపోయిందన్నారు.
80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి కాళేశ్వరం నిర్మిస్తే..
80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజినీర్‌గా మారి లక్షకోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం 50వేల ఎకరాల కు కూడా సాగునీరు ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే కొత్తగా విధుల్లో చేరుతున్న ఇంజినీర్లంతా ఆదర్శంగా తీసుకోవాల్సింది శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాం సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ మాత్రమేనని.. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను కాదని అన్నారు.
ఒక పూరి గుడిసె నిర్మించాలన్నా అక్కడ భూమి ఎలా ఉందో చెక్ చేస్తారని కానీ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేద న్నారు. ‘నేనే ఇంజినీర్‌ను, నేనే డాక్టర్‌ను అని గొప్పగా చెప్పుకున్న వ్యక్తి నేడు దొంగనని నిరూపించుకున్నాడు..’అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు ప్రాజెక్టులు కడితే ఊచలు లెక్కించాల్సిందేనని కొత్తగా విధుల్లో చేరుతున్న ఇంజినీర్లు గుర్తుంచుకుని పనిచేయాలన్నారు.
ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఎవరి పనివారు చేస్తే అంతా సక్ర మంగా ఉంటుందన్నారు. పరిమిత జ్ఞానం తో రాజకీయ నాయకులు చెప్పినట్లు వింటే నష్టపోయేది మీరేనని ఇంజినీర్లకు సూచించారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్డీఎస్‌ఏ అందించిన నివేదికలో కాళేశ్వరం కూలేందుకు కారణమైన అధికారులకు ఉరివేయాల ని నివేదికలందించినట్లు తెలిపారు.
రాష్ట్రం లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన లోపభూయిష్టమైన ప్రాజెక్టుల వల్ల అస్తవ్యవస్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఆన్‌గోయింగ్ ప్రాజెక్టును ఒక్కదాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. తుప్పు పట్టిపోయిన టన్నెల్ బోరింగ్ మెషీన్ పనులు ప్రారంభించిన తర్వాత కూలిపోయిందన్నారు. 8 మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు. సాగునీటి రంగానికి నిధులు ఖర్చు చేద్దామంటే నిధుల కొరత వేధిస్తోందన్నారు. అయినా కూడా కష్టపడి ప్రాధాన్యపరంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
అప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నా..
గత పదేళ్లుగా ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు ధర్నా చేశారని ఇప్పుడు నోటిఫికేషన్లు ఆపాలంటూ అశోక్‌నగర్‌లో ధర్నా చేసే పరిస్థితులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 14నెలల్లో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ లక్ష ఉద్యోగాలను అందించామని అన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2011లో భర్తీ చేసిన తర్వాత ఇప్పుడు తాము 563 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. అయితే అర్హత లేని వ్యక్తులు, కొందరు రాజకీయ నాయకులు గ్రూప్ 1పై కోర్టులో పిటిషన్ వేశారని..నియామకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో తమకు తెలుసన్నారు. అయినా త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలన్నీ భర్తీ చేస్తామని తెలిపారు.
ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు ప్రజల భావోద్వేగం..
నీటిపారుదల శాఖలో ఇంజినీర్ అంటే కేవలం అదొక ఉద్యోగం మాత్రమే కాదని రాష్ట్ర ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సాగునీరే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందన్నారు. ఈ భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయంగా లబ్ధ్ది పొందాయన్నారు. అతిపెద్ద ప్రాధాన్యమున్న శాఖలో కొత్తగా నియమితులవుతున్న మీరంతా క్షేత్ర స్థాయిలో మీరు భాగస్వాములు కావడం అదృష్టమమని అన్నారు.
సీఎం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి!
జలసౌధలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇన్నాళ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి పేరును చాలా సందర్భాల్లో పలువురు మర్చిపోయి వేరే పేరును ఉచ్చరించడంపై చర్చ జరుగుతుండగా ఈసారి ఏకంగా సాక్షాత్తు ముఖ్యమంత్రే తన పదవిని మర్చిపోయారు.
గత ప్రభుత్వం పదేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ పనులు పెండింగ్ పెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం టన్నెల్‌ను కదిలిస్తే కుప్పకూలిపోయిందని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు. తానే సీఎం అయి ఉండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎం అని సంబోధించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది.
ఏటా 5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టే లక్ష్యం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తమ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఇకపై ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టే లక్ష్యంగా తాము పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న ఇంజినీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ జంగ్ బహదూర్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్‌కుమార్‌సుల్తానియా, ముఖ్యకార్యదర్శులు ప్రశాంత్ పాటిల్, వినయ్ కృష్ణారెడ్డి, ఈఎన్సీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.