calender_icon.png 27 December, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలు విద్యలో రాణించాలి: డీఈవో రమేష్ కుమార్

27-12-2025 09:38:51 PM

చారకొండ: బాలికలకు విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థి దశ నుంచే బాలికలు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా పట్టుదలతో కృషి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు. శనివారం చారకొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిఇఓ రమేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టోరూమ్, వంటగది, డైనింగ్ హాల్ ను, వంటలను పరిశీలించారు.

విద్యుత్, తాగునీరు, బాత్రూం వంటి సదుపాయాలు సక్రమంగా వినియోగంలో ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతి గదుల్లో విద్యార్థినిల గణిత, జీవశాస్త్రం, ఆంగ్లంలో విద్యా సామర్ధ్యాలను ప్రశ్నలు జవాబులు రూపంలో అడిగి తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు.

ప్రతి రోజు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అంతకుముందు తిమ్మాయిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు.