calender_icon.png 27 December, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవతోనే మంచి గుర్తింపు..

27-12-2025 09:10:36 PM

సర్పంచులకు మంత్రి  జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం

 భైంసా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు సన్మానం

ఖానాపూర్/భైంసా,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాన్ని పక్కన పెట్టి, ప్రజా సేవనే పరమావధిగా భావించి పనిచేయాలి అని  పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సర్పంచులను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. వారి బాధ్యతలను గుర్తు చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

అప్పుడే మీరు ప్రజా సేవలో మంచి పేరు తెచ్చుకోగలరు అని  మంత్రి దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో పారదర్శక పాలన అందించడంలో గ్రామ సభల ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. ప్రతి గ్రామంలో విధిగా గ్రామ సభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోంది.

రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టబోతోంది. ఈ పథకాల గురించి సర్పంచులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చూడాలి అని మంత్రి కోరారు. ప్రజల మెప్పు పొందేలా పనిచేసి, ప్రతి సర్పంచ్ ఒక ఆదర్శ నాయకుడిగా ఎదగాలన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.