27-12-2025 09:23:01 PM
సహకార సంగం ఏర్పాటుతో రైతులకు మేలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): వెలిదండ గ్రామంలో నూతన రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని వెలిదండ గ్రామ సర్పంచ్ చనగాని సాంబయ్య గౌడ్,మలిదశ ఉద్యమకారులు జేఏసీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కు శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ప్రస్తుతం వెలిదండ గ్రామం రాయిని గూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఉందని దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వెలిదండ గ్రామంతో పాటు శివారు గ్రామాల్లో రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని,సాగు భూమి విస్తీర్ణం కూడా అధికంగా ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని వెలిదండ గ్రామంలో కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని వారు కోరారు.సంఘంలో రుణాలు,విత్తనాలు తదితర సేవలు సకాలంలో అందక ప్రస్తుతం రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వెలిదండలో ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు సులభంగా సేవలు అందుతాయని తెలిపారు. అంతేకాక సంఘం పరిధిలో వ్యవసాయ అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని అన్నారు. గ్రామ రైతులకు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సానుకూలంగా స్పందించి వెంటనే నూతన సొసైటీ మంజూరు చేయాలని వారు కోరారు.