తగ్గిన వెండి బంగారాలు
హైదరాబాద్, జూన్ 5: అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలన్నీ తగ్గిన నేపథ్యంలో స్థానిక మార్కెట్లో వెండి, బంగారాలు రెండూ దిగివచ్చాయి. బుధవారం హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.72, 650 వద్ద నిలిచింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర మరో రూ.200 క్షీణించి రూ.66,600 స్థాయికి దిగింది. రెండు వారాల క్రితం పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.
రూ.2,300 తగ్గిన వెండి
స్థానిక మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,300 తగ్గుదలతో రూ.96,200 వద్దకు దిగింది. ఇటీవల ఇది రూ. 1,02,000 స్థాయిని అధిగమించిన సంగతి విదితమే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు క్షీణించాయని, దీంతో స్థానికంగా దిగివచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 10 డాలర్ల మేర తగ్గి 2,332 డాలర్ల వద్దకు చేరింది. ఔన్సు వెండి ధర 30 డాలర్ల దిగువకు క్షీణించింది.






