27 June, 2026 | 4:44 AM

వడ్డీ రేట్ల కోత లేనట్లే..

06-06-2024 01:26 AM

రిజర్వ్‌ బ్యాంక్ పాలసీపై అంచనాలు

ప్రారంభమైన ఎంపీసీ సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 5: ఒకవైపు ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కల్గిస్తుండగా, మరోవైపు ఎన్నికల ఫలితాలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు దారితీయడంతో రిజర్వ్‌బ్యాంక్ తాజా సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలకు పెద్దపీట వేస్తుందన్న అంచనాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కూడా ఆర్బీఐ కీలక రేట్లలో కోత పెట్టదని అంటున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)  ద్రవ్య పరపతి విధాన సమీక్షను బుధవారం ప్రారంభించింది. మూడు రోజుల సమీక్ష అనంతరం శుక్రవారం జూన్ 7న కమిటీ నిర్ణయాల్ని వెల్లడిస్తుంది. రాజకీయ స్థిరత్వం పాలసీ ఏజెండా కొనసాగింపునకు సహాయపడుతుందని, అయితే మోదీ మూడో టెర్మ్‌లో తక్కువ ఆదాయ వర్గాలను సంతృప్తిపర్చేందుకు ప్రజాకర్షక పథకాల్ని ప్రవేశపెట్టే రిస్క్ ఉన్నదని యూబీఎస్ సెక్యూరిటీస్ ఎకానమిస్ట్ తన్వీ గుప్తా జైన్ చెప్పారు.

ఆర్థిక విధానం మారితే కఠిన సంస్కరణల్ని అమలు చేయడం క్లిష్ఠతరం అవుతుందన్నారు. జూలైలో లోక్‌సభకు సమర్పించే బడ్జెట్లో మధ్యకాలికంగా ద్రవ్యలోటు అదుపునకు కట్టుబడుతూనే, పాపులిస్ట్ ప్రతిపాదనలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నామన్నారు. జూన్ 7నాటి ఆర్బీఐ పాలసీ ప్రకటనలో రేట్ల కోతను ప్రస్తుతం మార్కెట్లు అంచనా వేయడం లేదు. అయితే ద్రవ్యలోటు అదుపునకు ప్రభుత్వ రుణ సమీకరణను తగ్గిస్తే దేశంలో డిమాండ్‌ను పెంచేందుకు రేట్లు తగ్గించే అవకాశం ఆర్బీఐకి ఉంటుందని జైన్ చెప్పారు. కానీ ప్రజాకర్షక పథకాల కోసం ప్రభుత్వం మార్కెట్ రుణాల్ని పెంచుకుంటే కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించలేదని వివరించారు. 2024లో రేట్ల కోతకు అతికొద్ది అవకాశాలే ఉన్నాయని బాండ్, మనీ మార్కెట్లు అంచనా వేస్తున్నాయన్నారు.

ప్రజాకర్షక విధానాలతో అధిక ద్రవ్యోల్బణం

ప్రజా వ్యయాన్ని పెంచడం మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని మనీ మార్కెట్ ట్రేడర్లు భావిస్తున్నారు. తెలుగుదేశం, జనతాదళ్ (సెక్యులర్) తదితర ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడుతున్నందున, అందుకు తగ్గట్టు విధానాల్ని మార్చాల్సి ఉంటుందని ఎమ్కే గ్లోబల్ లీడ్ ఎకనామిస్ట్ మాధవి అరోరా చెప్పారు. ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల భారీ డివిడెండును బదిలీ చేయాలని ఇటీవల ఆర్బీఐ నిర్ణయించడం కేంద్రానికి కొంత ఊరటనిచ్చే అంశమని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు. ఇప్పటికే కేంద్రం వద్ద రూ.1 లక్ష కోట్ల అదనపు ఆదాయం ఉన్నదని, దీనిని పలు మార్గాల్లో ఉపయోగించవచ్చన్నారు. ప్రధాన అవరోధాలేవీ ఎదురుకాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశిత 4.9 శాతం ద్రవ్యలోటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు.