బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తుకు ముప్పే

08-05-2024 01:05:21 AM

రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లు తీసేస్తది 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి 

కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాలకు రక్షణ 

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదు 

డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం సంపదను సృష్టించి.. ప్రజలకు పంచుతోందని తెలిపారు. బీజేపీకి అవకాశం దొరికితే రాజ్యాంగాన్ని మార్చడం.. రిజర్వేషన్లు రద్దు చేయడమే  ఎజెండా పెట్టుకుందని విమర్శించారు. బీజేపీకి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలిపించాలని కోరడం వెనక పెద్ద కుట్ర దాగుందని, పార్లమెంటులో 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ పదాన్ని తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం మార్చాలన్న బీజేపీతో బీఆర్‌ఎస్ కూడా కలిసిపోయిందని విమర్శించారు. 

ఆర్థికాన్ని రిపేర్ చేస్తున్నాం

పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక దానిని సరిచేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరిస్తుంటే.. ఆయనను భయపెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. హిట్లర్, ముస్సోలినిలాగా కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో దేశం అల్లకల్లోమైందని, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలపైన ఉందని అన్నారు. బీజేపీ కుట్రలను అర్థం చేసుకుని రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ్ యాత్ర చేపట్టారని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహంచి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడం, పంచడం జరుగుతుందని తెలిపారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీమేరకు తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైందని భట్టి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి 14 సీట్లు గెలిపించాలని కోరారు. రాహుల్‌గాంధీ చెప్పినట్లు ఎంపీ టికెట్ల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించలేదు కదా అని మీడియా ప్రశ్నించగా.. టికెట్లు రానివారికి భవిష్యత్‌లో న్యాయం చేస్తామని భట్టి తెలిపారు.