‘కాళేశ్వరం’పై న్యాయ విచారణ

08-05-2024 01:06:49 AM

మేడిగడ్డ బరాజ్ సందర్శించినజస్టీస్ పీసీ ఘోష్ 

ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడి

జయశంకర్ భూపాలపల్లి, మే 7(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. మంగళవారం ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు కమీషన్ అధికారులు, నిపుణుల బృందంతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. 7వ బ్లాక్‌లో 20వ ఫిల్లర్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. బరాజ్ దిగువ 19, 20, 21వ ఫిల్లర్లను పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్ దెబ్బతిన్న పరిస్థితులు, ఫిల్లర్లు కుంగుబాటు తదితర అంశాలపై అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుని పూజలు చేశారు. మేడిగడ్డకు చేరుకున్న కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రఘోష్‌కు ముందుగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ కిరణ్‌ఖరే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఓఅండ్‌ఎం జనరల్ అనిల్‌కుమార్, ఈఎన్సీ నాగేందర్‌రావు, సీఈ సుధాకర్‌రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ, ఈఈ తిరుపతిరావు, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు మేనేజర్ రజనీశ్ పాల్గొన్నారు.