28 April, 2026 | 6:35 PM

విధ్వంసమే

11-05-2024 01:29 AM

బీజేపీకి ఓటేస్తే జరిగేది అదే

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పెట్టుబడులు తెచ్చిందా? 

గుజరాత్ బాగుండాలి.. తెలంగాణ నాశనం కావాలా?

అవినీతిపరులతో అంటకాగి మోదీ అవాకులు

హైదరాబాద్‌లో ఎంఐఎంను గెలిపించటం వేస్ట్

మక్తల్, షాద్‌నగర్, గోషామహల్ సభల్లో సీఎం రేవంత్ 

హైదరాబాద్ సిటీబ్యూరో/నారాయణపేట/రంగారెడ్డి, మే 10 (విజయక్రాంతి): బీజేపీకి ఓటేస్తే విధ్వంసమేనని, తెలంగాణను ఆ పార్టీ వందేండ్లు వెనక్కి తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత విద్వే షాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్.. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, హైదరాబాద్‌లోని గోషామహల్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆశామాషీవి కావని.. పాలమూరు పౌరుషానికి ఢిల్లీ సుల్తాన్‌లకు మధ్య పోటీ అని అన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన నేతలు తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ బాగుండాలి.. తెలంగాణ మాత్రం కత్తులతో పొడుచుకోవాలా? అని నిలదీశారు. తాను ఉన్నంతవరకు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. తమకు ఓటేస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేస్తానంటున్న బీజేపీ.. ఉత్తరప్రదేశ్‌లో పరిశ్రమలు, పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎంపీ కాకపోతే వచ్చే నష్టమేమీ లేదని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి గెలవకపోతే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదని, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు ఆగిపోతుందని, కృష్ణా వికారాబాద్ రైల్వేలైన్ రాదని అన్నారు. పాలమూరులో వలస వచ్చిన కేసీఆర్‌ను గెలిపించామని, ఇప్పుడు పాలమూరు బిడ్డకు అండగా నిలవాలని కోరారు.  

మోదీ చుట్టూ అవినీతిపరులే

పాలమూరు జిల్లాలకు వచ్చిన ప్రధాని మోదీ ఇప్పటివరకు ఈ జిల్లాకు ఏమీ ఇవ్వనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పి పాలమూరుె రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటన చేస్తారని భావించానని, కానీ ఆయన అవేమీ మాట్లాడకుండా తనపై అవినీతి నిందలు వేశారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మోదీ అవినీతిపరులను పక్కన పెట్టుకొని నాపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉన్నది. నాపై నిందలు వేసేముందు ఆయన తనపక్కన కూర్చున్నవారి గురించి ఆరా తీయాలి కదా? పాలమూరు జిల్లాకు పట్టిన చీడపీడ డీకే అరుణ కుటుంబం. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పాలమూరులో కల్లు దుకాణాల నుంచి ఇసుక, చెట్టు, చేమ, పుట్టను కూడా వదలకుండా దోపిడీ చేశారు. నేను ఎప్పుడైనా ఎవరినైనా ఒక్క రూపాయి అడిగానా?’ అని ప్రశ్నించారు.  

కుమ్మక్కు రాజకీయాలు..

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఆ కుట్రలను చేధించాలని పిలుపునిచ్చారు. డీకే అరుణను గెలిపించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. షాద్‌నగర్‌కు త్వరలోనే మెట్రో రైలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 100 రోజులో బీఆర్‌ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, ఇక రాదని ఎద్దేవా చేశారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతుల రుణమాణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మారుస్తామని తెలిపారు.

ఎంఐఎంకు ఓటేయటం వేస్ట్

హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో నాలుగు దశాబ్దాలుగా ఎంఐఎంను గెలిపిస్తున్నా.. పాతబస్తీలో సమస్యలు పరిష్కారం కాలేదని.. మరోసారి ఆ పార్టీకి ఓటేయటంలో ఉపయోగం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీజేపీ పాతబస్తీకి మెట్రో రైల్‌ను ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ వలీవుల్లాన్లు గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు.