28 April, 2026 | 8:00 PM

అర్కెల సర్పంచ్ శ్రీను.. వృత్తి ధర్మం సింప్లీ!!

28-04-2026 06:19 PM

* పదవితో వచ్చే గర్వాన్ని దరిచేరనివ్వని సర్పంచ్

* గ్రామ పెద్దగా హోదా పెరిగినా కులవృత్తిని మరువలేదు

* బాధ్యత పెరిగినా.. ఇసుమంతైన అహంకారం పెరగలేదు

పాపన్నపేట: ఇదేంటి.. గడ్డపార, పార చేత పట్టి గుంత తవ్వుతున్న ఓ సాధారణ వ్యక్తి చిత్రాన్ని ప్రచురించారని అనుకుంటున్నారా..? ఇతను ఓ గ్రామ ప్రథమ పౌరుడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అర్కెల గ్రామం సర్పంచి బేగరి శ్రీనివాస్. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గ్రామస్తులు ఈయన్ను గెలిపించుకున్నారు. సర్పంచిగా ఎన్నికైనప్పటికీ పదవితో వచ్చే గర్వాన్ని దరిచేరనివ్వలేడు. తన పదవిని, కులవృత్తిని సమానంగా గౌరవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సర్పంచ్ పదవి చేపట్టినా.. గ్రామ పెద్దగా హోదా పెరిగినా.. తన కుల వృత్తిని మరువకుండా మంగళవారం గడ్డపార, పార చేతపట్టి గ్రామానికి చెందిన గడ్డమీది దేవయ్య మరణించడంతో అంత్యక్రియలకు బొంద తవ్వాడు. గ్రామ సర్పంచిగా ప్రజలకు సేవలు అందిస్తూనే అతని కులవృత్తి అయిన బేగరి కులవృత్తి మరువలేదు. అతని గ్రామంలో ఎవరు చనిపోయినా బొంద తవ్వి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నాడు. ఇసుమంతైనా పదవి అహంకారం లేకుండా కులవృత్తి చేయడంపై మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.