21-01-2026 12:00:00 AM
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్
ముకరంపుర, జనవరి20 (విజయ క్రాంతి): కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పార్టీ పని చేస్తోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే నినాదంగా తాము ప్రజల్లోకి వెళ్తున్నామని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క కాంగ్రెస్, బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచే సత్తా ఉన్న నేతలు లేకపోవడంతో, బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కండువాలు కప్పి తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
కండువాలు పట్టుకుని డివిజన్ల వెంట తిరుగుతున్నా వారికి ఆదరణ లభించడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు బీజేపీ చేసిందని సునీల్ రావు మాట మార్చడం హాస్యాస్పదమన్నారు. కండువా మార్చగానే గతం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా నిధులు తీసుకురాని కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ నగరానికి చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితోనే నగరం సుందరంగా మారిందని, డంప్ యార్డ్ తరలింపు వంటి ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రజలు విజ్ఞులని, అభివృద్ధికి పట్టం కడుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కచ్చు రవి, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బొంకూరి మోహన్, ఆరె రవి గౌడ్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, జల్లోజి శ్రీనివాస్, సతినేని శ్రీనివాస్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, పూరెల్ల సరోజ, ఒడ్నాల రాజు, సుంకిశాల సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.