గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఆగస్ట్ 18: గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులను ఆదేశించారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పా ల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగ తిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యం, ప్రజా సేవలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






