21-01-2026 12:34:10 AM
‘దిశా’ సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పనుల ప్రగతిపై సమావేశంలో చర్చించారు.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. ఎం.పీ లాడ్స్ నిధులను మంజూరు చేసేందుకు పలువురు కమీషన్ లు డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ ధోరణిని మార్చుకోవాలని సూచించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ వివరణ ఇస్తూ, ఈ అంశంపై సమగ్ర పరిశీలన జరిపామని, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఫులాంగ్ వాగు నిర్వహణ గురించి ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎక్కడికక్కడ కబ్జాలు జరుగుతున్నాయని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. కబ్జాదారులపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించాలని ఎం.పీ అర్వింద్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, దిశా కమిటీ ఆశన్న, లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.