04-06-2025 01:21:15 AM
విభిన్న కథతో రూపుదిద్దుకున్న మరో వెబ్‌సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘దేవిక అండ్ డానీ’ అనే ఈ వెబ్ సిరీస్‌లో రీతూవర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియాసింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వైవా హర్ష, షణ్ముఖ్, అభినయశ్రీ, మౌనికరెడ్డి, ఈశ్వర్య వుల్లింగల ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బీ కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చాగంటి నిర్మించారు. జూన్ 6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ.. “ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఆ సమయంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయతీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది.
చాలా మంది అమ్మాయిలకు చుట్టుపక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి నిరుత్సాహపరుస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది” అన్నారు. డైరెక్టర్ బీ కిషోర్ మాట్లాడుతూ “శ్రీకారం’ తర్వాత ఈ సిరీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. దీపక్‌రాజ్ అనే రైటర్ దగ్గర నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది.
ఈ సిరీస్ చూసే ప్రేక్షకుల సమయం వృథా కాదు. ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూర్యవశిష్ట్, శివ కందుకూరితోపాటు నిర్మాత సుధాకర్ చాగంటి, మౌనిక, నందిని, సినిమాటోగ్రాఫర్ వెంకట్ సీ దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, ఎడిటర్ కార్తీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.