యాదాద్రికి పోటెత్తిన భక్తులు

29-04-2024 01:25:37 AM

యాదాద్రిభువనగిరి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు నర్సింహ్మస్వామి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చారు. యాదా ద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిసన్నిదిలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, ఆరాధన, నిజాభిషేకం, అర్చనలతో పాటు ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నరసింహ్మ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. 

ఆదివారం ధర్మదర్శనానికి సుమారు మూడు గంటలు పట్టిందని, రూ.150 రుపాయల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే బ్రేక్ దర్శనాలతో రూ. 5.71 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 9.6 లక్షలు, వాహనాల ప్రవేశం ద్వారా రూ. 9 లక్షలు, వివిధ సేవల ద్వారా రూ.59.34 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. సుమారు 55 నుంచి 60వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మినర్సింహ్మస్వామిని దర్శించుకున్నారని అధికారుల అంచనా.