28 August, 2026 | 4:42 PM

నాగోబాకు కొత్త పంటల నైవేద్యం

28-08-2026 03:38 PM

నైవేద్య సమర్పణకు తరలివచ్చిన  మెస్రం వంశీయులు...

ఉట్నూర్, ఆగస్టు 28(విజయక్రాంతి): ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు నాగోబా(Nagoba)కు  ఆదివాసులకు ఖరీఫ్ సీజన్లో  చేతికి వచ్చిన కొత్త పంటల   నైవేద్యమును  నాగోబా దేవుడికి సమర్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో(Adilabad District) పాటు  పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తున్న మెస్రం వంశీయులు  ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పెసర, మినుము, మొక్కజొన్న, సజ్జలు, రాగులను పంట చేను నుండి తీసుకొని  శుక్రవారం నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి  మెస్రం వెంకట్రావు ఆధ్వర్యంలో నాగోబా దేవుడి పూజారులు  మెస్రం హన్మంతరావు, మెస్రం కోసే రావు, పర్ధన్  మెస్రం దాదేరావు, మెస్రం తిరుపతి లకు  కొత్త పంటలను అందించారు.

రైతుల నుండి  కొత్త పంటలు తీసుకున్న మెస్రం వంశం పెద్దలు నాగోబా దేవుడికి  నైవేద్యం వండి  మోదుగు ఆకులలో  దేవుడికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంగా  వందల ఏళ్ల నుండి  వస్తున్న ఈ సాంప్రదాయాన్ని  రాబోయే తరానికి అందించేందుకు ప్రతి ఏటా  ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటల్లో  ముందుగా చేతికి వచ్చే పంటలను కుల దేవతకు సమర్పించి మొక్కలు తీర్చుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో  సాగుచేసిన  పంటలలో చేతికి వచ్చిన పంటలను  నాగోపకు సమర్పించిన తర్వాతే తాము తింటామని, అప్పటివరకు  వాటిని తినమని  అన్నారు. నాగోబా దేవుడిని పూజించే మెస్రం వంశీయులు ఎంత దూరంగా ఉన్నా  ఈ పూజలకు తప్పనిసరిగా హాజరై దేవుడికి మొక్కుకుంటారని ఆలయ పీఠాధిపతి తెలిపారు. పెద్దలతో పాటు  నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు, సర్పంచ్ మెస్రం తుకారం, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి  మెస్రం నాగనాథ్ ల తో పాటు ఉమ్మడి జిల్లాలోని  వివిధ మండలాలతో పాటు  మహారాష్ట్రలోని చంద్రపూర్, యూత్ మాల్, తదితర జిల్లా ప్రాంతంలోని  మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.