ధరణి పెండింగ్ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించండి
ఇప్పటికే 163 సవరణలు చేశాం
రిజిస్ట్రేషన్ విలువ పెంపు ప్రతిపాదనలు పంపాలి
కలెక్టర్లకు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 14 (విజయక్రాంతి): కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ 32 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణిలో పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాష్ర్టంలో 1.38 లక్షల పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించామన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోనే ధరణిలో ఇప్పటివరకు సుమారు 163 సాంకేతిక సవరణలు చేసి కొత్త మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మరో దఫా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ స్థాయిలలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్ వంటి దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు పరిశీలించిన తర్వాత, డేటా కరెక్షన్ దరఖాస్తులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.
పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష
జిల్లాలవారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీసిన నవీన్ మిట్టల్ ౨.౨౦ లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలోనే మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష చేసుకోవాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాలకు అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయించాలని మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. ధరణి వెబ్‌పోర్టల్‌కు సంబంధించి జీఎల్‌ఎం, టీఎం 33 దరఖాస్తులలో డిజిటల్ సంతకాల ప్రక్రియ మార్పులు చేస్తున్నామని, కొన్ని సమస్యలు తహసీల్దార్ స్థాయిలో, మరికొన్ని సమస్యలు రెవెన్యూ డివిజన్ అధికారి, మరికొన్ని సమస్యలు కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ర్ట స్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే భూ సంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేస్తామని, వాటిని అత్యంత ప్రాధాన్యంతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని సీసీఎల్‌ఏ కమిషనర్ కలెక్టర్లకు సూచించారు.
భూముల విలువ పెంచేందుకు...
రాష్ర్టంలో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీని కోసం జిల్లాలో భూముల మార్కెట్ విలువ, ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువ వివరాలతో కూడిన నివేదికను అందించాలని నవీన్ మిట్టల్ కలెక్టర్లకు సూచించారు. అయితే మార్కెట్ విలువ నమోదులో ఎక్కడా ఎటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహారించాలని అన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనం, భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సీసీఎల్‌ఏ నుంచి జిల్లా కలెక్టర్లకు రిటర్న్ వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా ఆర్‌ఎస్‌ఆర్, సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లు జత చేయని దరఖాస్తులు ఉన్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఆర్ దరఖాస్తుల్లో తప్పుడు ఎంట్రీ జరిగితే దానిని ధ్రువీకరించి, తప్పుడు ఎంట్రీని తొలగించి, ఆర్‌ఎస్‌ఆర్ సవరణకు రిపోర్టుతో సహా దరఖాస్తులు పంపాలని కలెక్టర్లకు నవీన్‌మిట్టల్ సూచించారు.






