calender_icon.png 2 December, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలపై ధర్నాను జయప్రదం చేయాలి

02-12-2025 02:14:21 PM

చిట్యాల,(విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ)ఆధ్వర్యంలో ఈనెల 3న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద నిర్వహించునున్న మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ల బయన్న జర్నలిస్టులకు పిలుపునిచ్చాడు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్వహించిన మహాధర్నా సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు సకలజనుల సమ్మె లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు  ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించడంలో ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇండ్ల ప్లాట్లను, ఇళ్ల నిర్మాణం, అర్హులకు అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ప్రత్యేక ప్రమాద బీమా సౌకర్యం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు.

ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరిస్తుందనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా నిర్లక్ష్యం చేయడం జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తెలియజేస్తుందన్నారు. టి యు డబ్ల్యూ జె  (ఐ జె యూ) ఆధ్వర్యంలో  హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పెద్ది నరేందర్,  మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, సహాయ కార్యదర్శి కూనూరు మధు, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి లింగస్వామి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జిట్ట మల్లేష్, అమరోజు వెంకన్న, మెహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.