8 August, 2026 | 2:32 AM

డయల్ 112కు విస్తృత ప్రచారం కల్పించాలి

08-08-2026 12:29 AM

జిల్లా ఎస్‌పీ డాక్టర్ శబరిష్ 

మహబూబాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : నూతనంగా అత్యవసర సేవలు, పోలీసు సేవల కోసం ప్రవేశపెట్టిన డయల్ 112 కు ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సీరోలు పోలీస్ స్టేషన్ను ఎస్పీ శుక్రవారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులు, పెండింగ్లో ఉన్న గ్రేవ్ మరియు నాన్-గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణ, డయల్ 112 కాల్స్పై స్పందన, గ్రామాల సందర్శన వివరాలు, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన సమాచార సేకరణ, గ్రామ స్థాయిలో అమలవుతున్న వి.పి.ఓ.వ్యవస్థ పనితీరు, రాత్రి పహారా, స్టేషన్ సిబ్బంది వివరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు, నేరాల పరిస్థితి తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు.

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డయల్ 112 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఎస్పీ కృష్ణ కిషోర్, మరిపెడ సీఐ పవన్, సీరోలు ఎస్‌ఐ సంతోష్తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.