15-11-2025 12:02:36 AM
-బీహార్ పోతే పోయింది.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, నవంబర్ 14 (విజయక్రాంతి):బీహార్ ఎన్నికల్లో అసలు ప్రజలు ఓట్లు వేశారా లేక మిషన్లు ఓట్లు వేశాయో అర్థం కావడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడు తూ తాను రాహుల్ గాంధీకి ఒకటే చెప్పదలుచుకున్నానని బీహార్ పోతే పోయింది.. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల న్నారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు..ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారన్నారు. కొంతమంది రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరమన్నారు.
భారత దేశ అభివృద్ధికి ప్రధాన మంత్రిగా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టుల రూపకల్పన, ఐఐటీ ఐఐఎంల ఏర్పాటు వంటి అంశాలను కళ్లకు కట్టినట్టు చూపిన కళాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల్డ, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.