calender_icon.png 7 July, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకాణా తేని మీరా మాట్లాడేది..?

07-07-2025 12:00:00 AM

-బీజేపీ నాయకులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

-మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ పేరుతో బహిరంగ లేఖ విడుదల

హుస్నాబాద్, జూలై 6 : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయిన బీజేపీ నాయకులు తమకు లేఖలు రాయడం హాస్యాస్పదమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు రాసిన బహిరంగ లేఖలో, మోదీ సర్కార్ ’మెగా ఫెయిల్యూర్స్’ను గణాంకాలతో సహా ఎండగట్టారు.

11 ఏండ్లుగా బీజేపీ పాలన దేశ ప్రజలను అడుగడుగునా వంచిందని, ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించి ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ఆయన ధ్వజమెత్తారు. ‘వాగ్దానాలతో ఊదరగొట్టడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప మీరు చేసిందేమీ లేదు‘ అని ప్రభాకర్ నిప్పులు చెరిగారు.

రైతులు, యువత, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు... ఇలా అన్ని వర్గాలను బీజేపీ వంచించిందని ఆరోపించారు. ‘మీ వైఫల్యాలు రాస్తే రామాయణమంత, వింటే భారతమంత‘ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాంటి మీరు తమ సీఎంకు లేఖలు రాయడం ‘గురువింద సామెత‘కు నిదర్శనమని ప్రభాకర్ ఎద్దేవా చేశారు.

బీజేపీ హామీల భంగంపై ప్రశ్నల పరంపర మంత్రి పొన్నం ప్రభాకర్ తన బహిరంగ లేఖలో బీజేపీ ఇచ్చిన కీలక హామీలను గుర్తు చేస్తూ వాటి అమలు తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు.1 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రణాళికలో 60 ఏళ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు పింఛన్లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, ఎంత మంది రైతన్నలకు పింఛన్లు ఇచ్చారని ఆయన నిలదీశారు.

అలాగే, రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఏటా ఇచ్చే రూ.6 వేల కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని చెప్పి, ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే తెలంగాణ ఇవ్వడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టడంపై బీజేపీ వైఖరి ఏమిటని, దాన్ని తప్పు అంటారా లేదా సమర్థిస్తారా అని అడిగారు.

గత 11 సంవత్సరాల్లో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందని, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాకపోతే రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం సాధించారని ప్రభాకర్ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పదేళ్ల కింద హామీ ఇచ్చి, ఇప్పటికీ ఆ ఖాళీలు అలాగే ఉండటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

పదకొండేళ్లలో దేశంలో ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేని దుస్థితి బీజేపీదేనని, పైగా 1.31 కోట్ల మందికి రేషన్ బియ్యం ఎగ్గొట్టిన పాపం మీది కాదా అని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు అయినా, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పింఛన్లను పదకొండేళ్లుగా పెంచకుండా అన్యాయం చేసింది మీరు కాదా అని ప్రభాకర్ మండిపడ్డారు.

రైళ్లలో ఈ వర్గాలకు రాయితీలు ఎత్తేసిన అమానవీయులు మీరు కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్ ధర రూ.70 నుంచి రూ.110కి, డీజిల్ రూ.50 నుంచి రూ.100కి, గ్యాస్ బండ ధర రూ.400 నుంచి రూ.1100కి పెంచింది బీజేపీనేనని, 2014 ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదలపై మొసలి కన్నీరు కార్చిన మీరు అధికారంలోకి వచ్చి ధరలను అమాంతం ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డాలర్ 60 రూపాయలున్నప్పుడు గుండెలు బాదుకున్న మోదీ, ఇప్పుడు డాలర్ 84 రూపాయలైనా ఎందుకు మాట్లాడరని ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ.15 లక్షలు పంచుతామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని, ఇప్పుడు ఊసే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. సెస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు వెయ్యి కోట్లు సంపాదిస్తూ ప్రజల నడ్డి విరుస్తోందని, రైళ్ల టికెట్ల ధరలు పెంచింది కూడా మీ ప్రభుత్వమేనని ప్రభాకర్ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది, పీఎం ఫసల్ బీమా పథకంలో కేంద్ర వాటా తగ్గించి రైతులపై భారం మోపింది, 2022లోపు అందరికీ ఇళ్లు, టాయిలెట్లు, నల్లా కనెక్షన్ల హామీని నెరవేర్చనిది మీ ప్రభుత్వమేనని విమర్శించారు. తప్పుడు జీఎస్టీ, ఆర్థిక విధానాలతో రాష్ట్రాలకు నష్టం చేస్తున్నది, రూ.130 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని అధోగతి పాలు చేస్తోంది కూడా మీ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు.

 తెలంగాణపై బీజేపీ వివక్ష

మోదీ హయాంలో విద్వేష ప్రచారం, విధ్వంస చర్యలు, రాజకీయ నియంతృత్వం, ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్ల పెత్తనం, మత ఆధిపత్యం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం తప్ప ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణకు బీజేపీ తీరు వల్ల రెండు రకాల నష్టం జరుగుతోందని, ఒకవైపు కేంద్ర విధానాలతో ప్రజలు నష్టపోతుంటే, మరోవైపు విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను దగా చేస్తోందని ఆయన ఆరోపించారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు మళ్లించడం, ఐటీఐఆర్ రద్దు, పాల మూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, భద్రాద్రి భూములను ఏపీలో విలీనం, మూసీ ప్రక్షాళనకు నిధులు లేకపోవడం, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటులో జాప్యం, కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడం, ఐఐఎం, బీఆర్జీఎఫ్ నిధులపై వివక్ష వంటి అంశాలను మంత్రి ప్రస్తావించారు. ‘ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అప్పుడే అన్ని చేసేయాలని మీరు లేఖలు రాయడం మీ గుడ్డి ద్వేషానికి అద్దం పడుతోంది‘ అని మంత్రి  పొన్నం ప్రభాకర్ తన లేఖను ముగించారు.