07-07-2025 06:29:31 PM
యోగ మాస్టర్ కొంపెల్లి రమేష్ కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): ప్రస్తుత యాంత్రిక జీవనంలో మానవులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడిని అధిగమించేందుకు యోగ దివ్య ఔషధమని ప్రతి ఒక్కరు యోగాను సాధన చేసి ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ప్రముఖ యోగ మాస్టర్ కొంపెల్లి రమేష్ కుమార్(Yoga Master Kompelli Ramesh Kumar) కోరారు. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మద్ది శంకర్ యోగా సాధనలో భాగంగా చేస్తున్న ప్రతి రోజు 108 సూర్య నమస్కారాలు సోమవారం నాటికి వంద రోజులకు చేరడంతో ఆయనను అభినందించి మాట్లాడారు. ప్రతిరోజు 108 సూర్య నమస్కారాలు యోగాసనాలు వంద రోజులు పూర్తి చేసుకోవడం శుభ పరిణామం అన్నారు.
శంకర్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు యోగాను ఆచరించాలన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని ఒత్తిడిని జయించవచ్చని తద్వార సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని ఆన్నారు. యోగాలో బాగంగా సూర్య నమస్కారాలు, ఇతర యోగా ఆసనాలను ప్రతి ఒక్కరు ఆచరించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. ఈ సందర్భంగా 108 సూర్య నమస్కారాలు వందరోజులు పూర్తిచేసిన మద్ది శంకర్ ను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. ఈ కార్య క్రమంలో యోగా మాస్టర్లు వెంకటేష్, లక్ష్మణ్, రమేష్, ఓం ప్రకాష్ లు పాల్గొన్నారు.