07-07-2025 06:53:40 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): ఆషాడ బోనాలు అంటేనే హైదరాబాద్ జంట నగరాల్లో నెల రోజుల పాటు ఎంతో సందడిగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) అన్నారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ ప్రతినిధులు ఈ నెల 13 వ తేదీన మహంకాళి ఆలయంలో నిర్వహించే హోమానికి హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నెల 11వ తేదీన మహంకాళి ఆలయ పరిసరాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు సమగ్రంగా జరిగేలా పర్యవేక్షించనున్నట్లు వివరించారు. దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో గత 99 సంవత్సరాల నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు మాశెట్టి శ్రీనివాస్, మంత్రి కంది విశ్వనాధం, దక్కన్ మానవ సేవా సమితి అధ్యక్షుడు శ్యామ్ రావు, ప్రధాన కార్యదర్శి అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, సభ్యులు రఘు మోహన్, గడ్డం రాజేష్, నర్సింగ్ రావు, కమల్ కుమార్ తదితరులు ఉన్నారు.