జలసిరి గ్రామ సభలో సమస్యలపై చర్చ
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం 'జలసిరి' గ్రామ సభ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా 'జలసిరి' కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రతి ఇంటి వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సోక్‌పిట్లు ఏర్పాటు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని వివరించారు. సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి (ఏ.వీ.ఆర్) గ్రామంలో మంచినీటి బావుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, నర్సరీ వద్ద దారి ఆక్రమణను తొలగించాలని, దోమలు, పందుల సమస్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.






