ధాన్యం కొనుగోళ్లలో రూ.500 కోట్ల అక్రమాలు: BJP చీఫ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandra Rao) బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లలో రూ.500 కోట్లకు పైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల కష్టం, చెమట ఫలితాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజాధనాన్ని, ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యం ప్రభుత్వానికి రాలేదని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. 2023 నుంచి మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం -వచ్చిన బియ్యం మధ్య తేడా ఉందని రామచందర్ రావు ప్రశ్నించారు.
ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందని సమాచారం ఉందని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలు, ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై పారదర్శక, వేగవంతమైన దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థల్లో పర్యవేక్షణ ఉండాలని సూచించారు.అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కొనుగోలు, రవాణా, నిల్వ, మిల్లింగ్ ప్రక్రియల్లో పటిష్టమైన పర్యవేక్షణ, జవాబుదారీతనం కల్పించాలని డిమాండ్ చేశారు.







