ఔషధ గని.. పొంచి ఉన్న హాని
ఎండుతున్న వేపచెట్లు
పంటలపై చీడ, పీడలను అరికట్టడంలో దీనిపాత్ర కీలకం
జిల్లావ్యాప్తంగా వేల చెట్లకు సోకిన వ్యాధి
డై బ్యాక్ వ్యాధి అంటున్న నిపుణులు
నివారణకు పలు సూచనల వెల్లడి
సూర్యాపేట, మార్చి 30 (విజయక్రాంతి): ఔషధ గని వేప చెట్టుకు ఆపదొచ్చింది.. అంతు చిక్కని వ్యాధితో అకస్మాత్తుగా పచ్చని కొమ్మలు ఎండిపోతున్నయ్ దీంతో దానికి హాని నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వేప చెట్లు ఎందినట్లు కనిపించడంతో చూపరులు చెట్లకు ఏమైంది, దీనికి ఏం చేయాలి అంటూ చర్చించుకుంటున్నారు. పొలాల వద్దనే కాదు ఇండ్లలో ఉన్న చెట్లకు సైతం ఇదే పరిస్థితి. దీంతో చెట్టుకు ఏదో ఆపద వచ్చిందంటూ పెంపకందారులు కంగారు పడుతున్నారు.
చెట్టు లేని ఊరే లేదు
వేపచెట్టు లేని ఊరు లేదనేది అందరికి తెలిసిన అక్షర సత్యం. ఊరే కాదు ప్రతి చోట ఈ చెట్టు ఉంటుంది. పల్లెల్లో ఈ చెట్టుకు సర్వరోగ నివారిణిగా పేరు ఉంది. ఇంటి ఎదుట ఈ చెట్టు ఉంటే.. డాక్టర్ ఉన్నట్టుగా భావిస్తుంటారు.
వేప చెట్టుకు ఆపదొచ్చింది
అనేక రోగాలను తగ్గించే చెట్టుకే ప్రస్తుతం ఆపదొచ్చింది. పర్యావరణ పరిరక్షణలో మేలు చేసే ఈ చెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఊరిలో పచ్చగా దర్శనం ఇచ్చే ఈ వేప చెట్లు ఉన్నట్టుండి మోడు బారిపోతున్నాయి. అంతు చిక్కని తెగులు సోకి వేప చెట్లు కళాహీనంగా తయారవుతున్నాయి. ఆకులు, కొమ్మలు, కాండం ఎర్రబారి చెట్టు మోడుబారిపోతోంది. గతేడాది వేలాది చెట్లకు సోకిన ఈ తెగులు.. ఈ ఏడాది మళ్లీ విజృంభిస్తోంది. చిగుర్ల నుంచి ప్రారంభమై మొదలు వరకూ నిలువునా ఎండి పోతున్నాయి. గతంలో కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో కనిపించే ఈ తెగులు ఇప్పుడు తెలంగాణలో కూడా వ్యాపించింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
చెట్టుతో ఉపయోగాలెన్నో..
వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా అరికడుతుంది. అందుకే అన్ని రకాల పంటలపై దీనిని పిచికారి చేస్తుంటారు. ఇంత ప్రాధాన్యత గల వేప చెట్లు రహదారికి ఇరువైపులా, పొలం గట్లపై, ఎక్కడపడితే అక్కడ నీడనిచ్చే చెట్లుగా ఉన్నాయి. నిత్య జీవితంలో వేపచెట్టు ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నాయి. పల్లెలు పచ్చగా ఉండేందుకు ఈ వేప చెట్లు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడంలో ఎంతగానో ఉపకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లను ఇలవెల్పుగా.. దైవంగా కూడా పూజిస్తుంటారు. అమ్మవారు సోకితే ఈ చెట్టు ఆకులను ఉపయోగించడం పల్లెవాసులకు బాగా తెలిసిన పద్ధతి.
డై బ్యాక్ వ్యాధి..
వేప చెట్లకు కొద్దిగా రోజులుగా అంతు చిక్కని వ్యాధితో చెట్ల కొమ్మలు ఎండిపోతున్నాయి. వేప చెట్లు ఎండిపోవడానికి డై బ్యాక్ వ్యాధి కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. టీమస్కిటో బగ్ అనే కీటకం వేప చెట్టు ఎండిపోవడానికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శీలింద్రాల ద్వితీయ సంక్రమణ ద్వారా వేపకు ఎండుతెగులు సంక్రమిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రివేళ టీ మస్కిటో బగ్ అనే కీటకం విజృంభించి వేప చెట్టు ఆకు కణజాలంలోని రసాన్ని పీల్చి పిప్పి చేస్తుందని చెబుతున్నారు. దీంతో రెండు మూడు నెలల్లోనే వేపచెట్లు పూర్తిగా నిర్జీవమవుతాయని చెబుతున్నారు. అధిక వర్షాలు, ఉష్ణోగ్రతలతో ఈ తెగులు సోకుతుందని, సీజన్ పూర్తయితే చెట్లు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని చెబుతున్నారు.
నివారణ చర్యలు చేపట్టవచ్చు
డై బ్యాక్ వ్యాధి నివారణకు పలు చర్యలు చేపట్టి వేప చెట్లకు ఈ విధమైన ఇబ్బందులు కలుగకుండా చూడవచ్చు. ఇందుకు 500 లీటర్ల నీటికి 100 గ్రాముల ఎసిటామిప్రిడ్, లేదా 1,250 గ్రాముల సాఫ్ లేదా స్ప్రింట్ శీలింద్రనాశిని మిశ్రమాన్ని చెట్టంతా పిచికారీ చేయాలి. వీటితోపాటు బోవిస్టిన్, కాలిజిన్, మొనోక్రోటోపాస్, ప్రోపినోపాస్, థయామెధక్సిమ్ అనే ఫెస్టిసైడ్ లను , లేదా మైదాకును ముద్దగా చేసి పిచికారిచేయడం ద్వారా కూడా వ్యాధిని అరికట్టవచ్చు.
దొంగరి నరేష్, కేవికే ప్రోగ్రాం కో ఆర్డినేటర్, గడ్డిపల్లి




