వాగు పొంగితే తొవ్వ బందే?
వానకాలంలో బాహ్య ప్రపంచానికి గిరిజన గూడేలు దూరం
టెండర్లు పూర్తయిన పనులు చేపట్టని కాంట్రాక్టర్లు వరదల సమయం..
రాకపోకలకు అంతరాయం..
వాగులు పొంగితే ఆ గిరిజన గూడలు బాహ్య ప్రపంచానికి దూరం..
టెండర్లు పూర్తయిన పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం..
ఉట్నూర్, జూన్ 30 (విజయక్రాంతి): వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసి వాగులు పొంగి పొర్లుతే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. భారీ వర్షాలు పడితే వాగులు పొంగడంతో ఏజెన్సీ ప్రాంతంలోని గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ రూరల్, నేరడిగొండ, ఇచ్చోడ, బజారత్నూర్ తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు వాగులపై వంతెనలు నిర్మించాలని గిరిజనులు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్న వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎమ్మెల్యేలు అభివృద్ధిపై దృష్టి సారించి వాగులపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్న పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయడం లేదని అధికారులు అంటున్నారు.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించుటకు, వాగులపై కల్వర్డ్ లు, వంతెన నిర్మాణానికి 2021-22 సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 40 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మంజూరు చేసిన నిధులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఉన్నత అధికారులు మంజూరైన నిధులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించి నాలుగేళ్లు పూర్తయిన నేటికీ ఆ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చెందాగా పనులు నిలిచిపోయాయి.
కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. టెండర్లు అయిన నిధులతో పాటు కొన్ని గ్రామాలకు అత్యవసరంగా రహదారి సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ఈ వర్షాకాలంలో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులతో నిలిచిన పనులు..
అదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికూరి గ్రామ పంచాయతీ కేంద్రానికి మట్టి రోడ్డుతో పాటు వాగుపై వంతెన నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ రాజర్శి షా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు చేశారు. మంజూరైన పనులను ప్రారంభించుటకు కాంట్రాక్టర్ ముందుకు రాగా అటవీ శాఖ అధికారులు అనుమతి లేదని కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు అల్లికోరి గ్రామ పటేల్ గంగారాం ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వర్షాలు కురిస్తే తమ గ్రామం నుండి బయటకు రావాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వాగు దాటవలసిన పరిస్థితి ఉందని పటేల్ వివరించారు. గ్రామంలో అనారోగ్యానికి గురి అయినా, గర్భిణీలను ప్రసూతి, ప్రసూతి కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా వాగు దాటవలసిన పరిస్థితి ఉందని గంగారాం పటేల్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ తీసుకొని వంతెన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
వర్షం పడితే వాగు దాటలేము..
ఇంద్రవెల్లి మండలంలోని మామిడి గూడ గ్రామానికి బీటీ రోడ్డు కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 75 లక్షలు, వాగుపై వంతెన నిర్మాణానికి రూ.3.58 కోట్లు మంజూరు చేసి నాలుగేళ్లు అయిన నేటికీ పనులు పూర్తి కాలేదని గ్రామస్తులు వాపోయారు. బీటీ రోడ్డు పనులు ప్రారంభించి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారని సేద్మకి భీమ్ రావు అన్నారు. వంతెన పనులు తీసుకున్న కాంట్రాక్టర్ పనులు నీటికి ప్రారంభించలేదని గ్రామస్తులు తెలిపారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు.
కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు..
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు టెండర్లు పిలిచిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని టెండర్లు అయినా పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసిన పనులు చేసేందుకు రావడంలేద. కొన్ని రహదారుల పనులు, కల్వర్టుల పనులు అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో నిలిచిపోయాయి.
తానాజీ జాదవ్,
ఈ.ఈ ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ఉట్నూర్.






