350 మంది చిన్నారులకు సైకిళ్ల పంపిణీ
జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి, జూన్ 19(విజయక్రాంతి): ఏఐసీసీ నేత రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కేజీల భారీ కేక్ను చిన్నారులతో కలిసి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 350 మంది చిన్నారులకు సైకిళ్ళను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
సంగారెడ్డి జిల్లాకు బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ లాంటి కేంద్ర సంస్థలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం కేంద్ర రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. బీజేపీ నాయకులు నెహ్రూ పాలనని బ్రేక్ చేశామని సంబరాలు చేస్తున్నారని, రాహుల్గాంధీ తల్లి, తండ్రి, తాత, నానమ్మ దేశానికి ఏం చేశారో తాను చెబుతానని, మరి 12 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో ఏం చేశారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల చొప్పున ప్రధాని మోడీ యువతకి 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారని విమర్శించారు. దేవుడి పేరుమీద బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.






