15 August, 2026 | 1:44 AM

పూర్తి దశకు కేవైసీ..

15-08-2026 01:09 AM

డిజిటల్ కార్డులే ఆలస్యం

కరీంనగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ప్రభుత్వం ఆగస్టు 15 నుండి అత్యాధునిక పి వి సి స్మార్ట్ (డిజిటల్) రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రేషన్ కార్డుల కె వై సి ప్రక్రియ 85 శాతం పూర్తయింది. ఆగస్టు31 వరకు గడువు విధించారు.

ఉమ్మడి జిల్లాకు ఇంకా స్మార్ట్ కార్డులు రాలేదు, ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాలో వచ్చే నెల నుండి ఇచ్చే అవకాశం ఉంది. నకిలీలను అరికట్టడానికి క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి తొమ్మిది భద్రతా ఫీచర్లతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 1.05 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను అం దించనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పీవీసీ మెటీరియల్తో వాటర్ఫ్రూఫ్గా తయారీ చేశారు. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెకస్ట్ లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం కార్డుల వలె సులభంగా జేబులో పెట్టుకునే సౌలభ్యం ఉంటుంది. 

- 85శాతం పూర్తి..   

కరీంనగర్ జిల్లా మొత్తం 3,22,408 రేషన్ కార్డులు ఉండగా 9,58,570 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 2,11,201 రేషన్ కార్డులకు సంబంధించి 5,79,182 మంది లబ్ధిదారుల ఈ కేవైసీ పూర్తయింది. 95,810 రేషన్ కార్డులకు సంబంధించి 2,16,599 మంది లబ్ధిదారుల ఈ కేవైసీ పూర్తికాగా, 1,38,316 మంది లబ్ధిదారుల ఈ కేవైసీ పూర్తి కాలేదు. 15,397 రేషన్ కార్డులకు సంబంధించి 24,473 మంది లబ్దిదారుల ఈ కేవైసీ పూర్తి కాలేదు. జగిత్యాల జిల్లాలో మొత్తం 3,36,331 రేషన్ కార్డులు ఉండగా 9,85,713 మంది లబ్ధిదారులు ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,88,031 రేషన్ కార్డులు ఉండగా 5,56,352 మంది లబ్ధిదారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 2,31,175 రేషన్ కార్డులు ఉండగా 6,78,165 మంది లబ్ధిదారులు ఉన్నారు. కేవైసీ 85 శాతం మేర పూర్తయింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువును పొడిగించింది. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ ఈపిడీస్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని రేషన్ దుకాణం , మీసేవా కేంద్రంలో బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారి తెలిపారు.