22-11-2025 05:02:16 PM
ఎలక్ట్రిక్ ఆటోలు, బైకులు లబ్ధిదారులకు అందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఆవరణలో స్త్రీనిధితో రుణ సహాయం కింద ఎలక్ట్రికల్ ఆటోలు, బైకులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో కొనసాగుతున్న అత్యున్నత సహకార క్రెడిట్ సొసైటీ, జిల్లాలోని మహిళా స్వయం సహాయక బృందాలకు (SHGs) రుణాలను అందిస్తూ, పేదరిక నిర్మూలనలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. సహకార సంఘాల కింద నమోదైన స్త్రీనిధి, బ్యాంకింగ్ రంగంలోని క్రెడిట్ ను సమర్థంగా భర్తీ చేస్తూ, మహిళల జీవనోపాధి అభివృద్ధికి వివిధ ఆదాయ కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు అందిస్తోందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని కామారెడ్డి, లింగంపేట్, రాజంపేట, దోమకొండ, బిక్నూర్ మండలాలకు చెందిన మొత్తం 11 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల స్త్రీనిధి బ్యాంకు ఆర్థిక సహకారంతో 2 ఎలక్ట్రిక్ ఆటోలు, 9 ఎలక్ట్రిక్ బైకులు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన సాధనలో స్త్రీనిధి బ్యాంకు అందిస్తున్న ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. వాహనాల పంపిణీతో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, వారిలో ఆర్థిక స్థిరత్వం సాధనకు మరింత ప్రోత్సాహం లభించనుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డి ఆర్డిఓ విజయలక్ష్మి, స్త్రీనిధి జోనల్ మేనేజర్ రవికుమార్, స్త్రీనిధి రీజినల్ మేనేజర్ కిరణ్ , డిపిఎంలు, ఏపిఎంలు, సిసిలు, వివో ఏ ఎస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.