12 August, 2026 | 1:32 AM

సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

12-08-2026 12:28 AM

వేరుశనగ నూనె ప్రాసెసింగ్ యూనిట్‌కు స్థలం కేటాయించాలి

నారాయణపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి): దామరగిద్ద మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్ను జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం పరిశీలించారు. మండల మహిళా సమాఖ్య కార్యాలయం పక్కన ఉన్న భవనంలో 2019 సంవత్సరం నుంచి సీజన్వారీగా మహిళా సమాఖ్య సభ్యులు సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నట్లు డీపీఎం జయన్న కలెక్టర్కు వివరించారు.

యూనిట్ ద్వారా వచ్చిన లాభాలు, మహిళలకు కల్పించిన ఉపాధి అవకాశాలతో పాటు యూనిట్లో తయారు చేసిన సీతాఫలం గుజ్జును విదేశాలకు సైతం ఎగుమతి చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత సీజన్లో కూడా సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్ను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న భవనంలో సీతాఫలాలను నిల్వ చేసేందుకు, అవసరమైన ఫ్రిజ్లను ఏర్పాటు చేసేందుకు స్థలం సరిపోవడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

యూనిట్ నిర్వహణకు అనువుగా పెద్ద గోదాం నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. దీనిపై తహసీల్దార్ తిరుపతయ్య మాట్లాడుతూ మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు కలెక్టర్కు తెలిపారు. వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్కు కేటాయించాలని కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు. అదేవిధంగా వేరుశనగ నూనె ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా అనువైన స్థలాన్ని కేటాయించాలని సూచించారు. స్థలం కేటాయించే వరకు ప్రస్తుత సీజన్లో ఉన్న భవనంలోనే సీతాఫలం ప్రాసెసింగ్ యూనిట్ను కొనసాగించాలని మహిళా సమాఖ్య సభ్యులకు కలెక్టర్ సూచించారు.

మహిళా సంఘాల కార్యకలాపాలపై ఆరా

అనంతరం మండలంలోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలు, ఎన్పీఏ, కిశోర బాలికల సంఘాల ఏర్పాటు, వీఓ భవనాల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలో నిర్మాణంలో ఉన్న వీఓ భవనాలను మరో 20 రోజుల్లోపు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ‘మై వన్’ సాంకేతికతను వినియోగించి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

వీఓ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

చివరగా మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో కొనసాగుతున్న వీఓ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, పనులను త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వెంకట్ రాములు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, ఎంపీడీవో సాయి లక్ష్మీ, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, ఏపీఎం తదితరులు పాల్గొన్నారు.