calender_icon.png 13 December, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

13-12-2025 10:13:27 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం క్లబ్ నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన తాగునీటి వసతి, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు తదితర అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే పీ.ఓలు, ఓ.పీ.ఓలతో కూడిన పోలింగ్ బృందాలన్నీ హాజరయ్యారా లేదా అన్న విషయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది ప్రతి అధికారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి పోలింగ్ సామాగ్రి, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని సూచించారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సంబంధిత ఆర్‌.ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో సమర్థవంతంగా, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబంధితపై అధికారులను సంప్రదించి పరిష్కారం పొందాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.