calender_icon.png 13 December, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రవెల్లిలో స్వల్ప ఉద్రిక్తత..

13-12-2025 10:04:11 PM

* ఓట్లు వేయలేదని ప్రజలు, వ్యాపారస్తులపై, దుర్భాషలాడిన వార్డు మెంబర్..

* దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేసిన వ్యాపారస్తులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయకపోవడంతోనే తాను ఓడిపోయాననే కోపంతో ఓ వార్డు మెంబర్ ఆ వార్డు ప్రజలపై, వ్యాపారస్తులపై దుర్భాషలాడుతూ ఫోన్ లు చేసి బెదిరించడంతో వ్యాపారస్తులందరూ నిరసన వ్యక్తం చేయడంతో ఇంద్రవెల్లి మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డు నుండి కాంబ్లే అతీష్ అనే వ్యక్తి వార్డు సభ్యునిగా పోటీ చేశాడు.

ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో కోపంతో ఉన్న కాంబ్లే అతీష్ గతరాత్రి వార్డు ప్రజలతో పాటు వ్యాపారస్తుడు దీపక్ సింగ్ శేఖవత్ కు ఫోన్ చేసి, తనకు ఓటు ఎందుకు వేయలేదని బెదిరించడంతో పాటు దుర్భాషలడారు. ఇంద్రవెల్లిలో మీరు వ్యాపారం ఎలా చేస్తారో చూస్తానంటూ బెదిరించాడు. దీంతో వ్యాపారస్తులందరూ కలిసి శనివారం దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సదరు కాంబ్లే అతీష్ పై పోలీసులకు వ్యాపారస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో కాంబ్లే అతీష్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు.