13-12-2025 10:33:58 PM
జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్
మోతే (విజయక్రాంతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం మోతె మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను సందర్శించారు. ఆయా డిఆర్సి కేంద్రాలలో కలెక్టర్ మాట్లాడుతూ మోతే మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినవని, మిగతా 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకొరకు 231 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని పిఓలు, ఏపీవోలు పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, బ్యాలెట్ పేపర్లు క్రమ పద్ధతిలో ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించుకోవాలని చెప్పారు.
సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగినదని వారికి కేటాయించిన గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లకు జోనల్ ఆఫీసర్ తో వెళ్లి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని అక్కడ రాత్రి బస చేయాలని, సాయంత్రం సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోగానే ఆ పోలింగ్ స్టేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించి పోలింగ్ కు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మండల టీంకు లేదా జిల్లా టీమ్ కు సమాచారం అందిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
పోలింగ్ తదుపరి మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ టేబుల్ కు దూరం పాటించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తయిన పిదప స్టేజ్-II రిటర్నింగ్ ఆఫీసర్లు ఫలితాలు వెల్లడించే ముందు జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకొని తుది ఫలితాలు ప్రకటించాలని తెలిపారు.
ఈ అనుమతి కొరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలక్షన్ సెల్ కు ఫోన్ కాల్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా అనుమతి తీసుకొని ఫలితాలు ప్రకటించాలని ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన పిదప బ్యాలెట్ పోల్ ఓట్లు జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రంలో అప్పగించాలని, ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించి రెండవ విడత పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లు సీతారామ్ నాయక్, ఎంపీడీవోలు ఆంజనేయులు, తాసిల్దార్లు వెంకన్న, ఎలక్షన్ ట్రైనర్ తదితరులు పాల్గొన్నారు.