13-12-2025 10:42:05 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉండగా, ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిరిసిల్ల వాసిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిసిల్ల మండలానికి చెందిన రిక్కమల్ల సంపత్ అశోక్‌నగర్, సిరిసిల్లకు చెందిన వ్యక్తి తంగళ్ళపల్లి గ్రామంలోని కేసీఆర్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.
దీనిపై స్పందించిన తంగళ్ళపల్లి మండల ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(FST) ఇన్‌చార్జ్ కన్నవేణి సంజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రిక్కమల్ల సంపత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సైలెన్స్ పీరియడ్‌లో కొత్త వ్యక్తులు మండలంలోకి వచ్చి ప్రచారం నిర్వహించినా, ఓటర్లను మభ్యపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.