19 March, 2026 | 3:27 AM

టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

19-03-2026 12:23 AM

పదోతరగతి పరీక్షాకేంద్రం తనిఖీ,  పలు పాఠశాలలు సందర్శించి పరిశీలన 

టేకులపల్లి, మార్చి18(విజయక్రాంతి): కలెక్టర్ అంకిత్ బుధవారం టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల పఠన సామర్థ్యం, పాఠశాల మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నిర్వహణను సమగ్రంగా తనిఖీ చేశారు. ముందుగా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థుల హాజరు శాతం, పర్యవేక్షణ చర్యలను సమీక్షించి, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై సంబంధిత ఉపాధ్యాయుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో 180 మంది విద్యార్థులు కేటాయించగా అందరూ హాజరయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉండి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడేలా చూడాలని సూచించారు.

మాస్ కాపీయింగ్కు ఏవైనా అవకాశాలు ఉండకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని, పరీక్షా పత్రాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు. అదనంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలకు అనుమతించరా దని హెచ్చరించారు.  అనంతరం కోయగూడెం ప్రాథమిక బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను సందర్శించారు.

9వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్, తెలుగు పాఠ్యపుస్తకాలను చదివించి, వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల వంటగది, వాటర్ ప్లాంట్, గ్యాస్ సిలిండర్లు, ఆర్ ఓ ప్లాంట్ వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆర్ ఓ ప్లాంట్లకు అవసరమైన మరమ్మత్తులు చేయడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాలలో సురక్షితమైన మంచినీరు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. సుమారు 200 మంది శిబిరాన్ని సందర్శించగా, 100 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడినట్లు వైద్యులు తెలిపారు. బీపీ, షుగర్, ల్యాబ్ పరీక్షలు, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల సేవలను కలెక్టర్ సమీక్షించారు. 

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి శ్రీరామ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీవో మల్లీశ్వరి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధన, బోధనేతర సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ డాక్టర్  వెంకటేష్,  దేవా, సిహెచిపీ పార్వతి, టిహెచ్‌ఎన్ చంద్రకళ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.