24-05-2025 01:11:20 AM
రామాయంపేట, మే 23: వికలాంగురాలిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...ఈనెల 12న రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో మహిళా దివ్యాంగురాలి శవం లభ్యం కావడంతో గ్రామానికి చెందిన భూమలింగం ఇచ్చిన సమాచారం మేరకు రామాయంపేట పోలీసులు హతురాలిని బండతో మోడీ చంపినట్లు గుర్తించారు.
ఈ విషయమై రామాయంపేట పోలీసులు దర్యాప్తు చేపట్టి కామారెడ్డి శివారులో నిందితుడు కొండని రవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. హతురాలిని బ్యాగరి మైసవ్వ(35)గా గుర్తించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాలకు చెందిన మైసవ్వతో కొండని రవీందర్ గత ఆరు నెలలుగా స్నేహంగా ఉంటూ ఆమె వికలాంగురాలు కావడంతో సహకారం అందించేవాడు. దీంతో ఇద్దరు మధ్య అక్రమ సంబంధం కొనసాగింది.
నిందితుడు రవీందర్ ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కాజేయాలని కుట్రపన్ని ఈనెల 12న యాదగిరిగుట్టకు వెళ్లాలని తన సొంత కారులో తీసుకువెళ్తూ రామయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలోని శివారి అడవిలో ఆమెకు మద్యం తాగించి బంగారం తీసుకొని బండరాయితో ఆమె తలను పగలగొట్టి హత్య చేశాడు.
కాగా నిందితుడు కామారెడ్డి ప్రాంతంలో నగలు అమ్మడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రామాయంపేట పోలీసులు గుర్తించి అదుపులోనికి తీసుకురావడం జరిగిందని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు ఈ దర్యాప్తులో కానిస్టేబుళ్లు ఎండి సాజిద్ అలీ, భాస్కర్, నాగభూషణంరావు, సూర్యప్రకాష్, మహేష్ లను సీఐ అభినందించారు.