calender_icon.png 20 August, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి బొనాంజా!

20-08-2025 12:21:16 AM

పంద్రాగస్టు రోజు ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి బొనాంజా ప్రకటించారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)ని సరళీకృతం చేసి పేద, మధ్యతరగతికి దీపావళి పండుగ నుంచి పన్నులు చెల్లించడం పండుగే అవుతుందని భరోసానిచ్చారు. జీఎస్టీ రెండు స్లాబుల్లో ఉంటుందని, ఇకపై వ్యాపారుల చెల్లింపులూ సులభతరమవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది.

ఐదు స్లాబుల్లో మద్యం, పొగాకు ఉత్పత్తులు ఇతర హానికరమైన వాటిపై ఉన్న 40 శాతం పన్ను స్లాబ్ మినహాయిస్తే ఇక జీఎస్టీ రెండు స్లాబ్‌ల్లో 5 శాతం, 18 శాతంగానే ఉంటుందని సూచన. 12 శాతం, 24 శాతం స్లాబ్‌ల కింద ఉన్న వస్తువులను 5 శాతం, 18 శాతం కిందికి తేవడం వల్ల పేపర్ వర్క్ తగ్గి, వస్తువుల రేట్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందనేది ప్రభుత్వ భావన. అయితే అక్టోబర్‌లో ఈ పన్నుల సరరళీకృత ఫలితాలేమిటనేది తేలుతుంది.

ప్రధాని ఇవ్వనున్న దీపావళి కానుక జీఎస్టీ విధానంలో సమూల మార్పులు తీసుకువస్తుందా లేదా అని ఇటు సగటు భారతీయుడు, అటు వ్యాపార వర్గాలు ఎదురుచూస్తున్నాయి.2017లో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి పన్నుల్లో అనేకసార్లు మార్పులు చేర్పులు జరిగాయి. జీఎస్టీని లెక్కకట్టేందుకు దేశంలో అనేక మంది నిపుణులు పుట్టుకొచ్చారు. జీఎస్టీని లెక్కించి, టాక్స్ రిటర్న్స్‌కు వెళ్లడమంటే, అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించేందుకు వెళ్లినట్టుగానే వ్యాపారులు బాధలు పడ్డారు.

జీఎస్టీని రెండు స్లాబ్‌లకు కుదించడం ద్వారా వ్యాపారులకు ఈ పన్ను విధానం ఇకపై కష్టాలను తీర్చే విధంగా ఉంటుందని ఆశించవచ్చు. ఎందుకంటే, ప్రపంచంలోనే ఇంత సంక్లిష్ట పన్ను విధానం ఎక్కడా లేదని ఆర్థికవేత్తలే ఒప్పుకున్నారు. ఇక పన్నుల విధానంలోని లొసుగుల వల్ల వివాదాలకు, కేసులకు అంతేలేదు. సప్లయ్ చైన్‌లో ఎక్కడ, ఎంత జీఎస్టీ అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే.

రెండు నెలల్లో పన్నుల విధానంలో అద్భుతాలు జరగనున్నాయనే సంకేతంతో అక్టోబర్ వరకు డిస్ట్రిబ్యూటర్లు, కొనుగోలుదారులు వేచిచూసే పరిస్థితి వచ్చింది కనుక సెప్టెంబర్‌లో మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేమని వ్యాపారులు అంటున్నారు. పన్నుల సరళీకరణతో రాష్ట్రాల జీఎస్టీ రాబడి, కేంద్ర వాటా ఎలా ఉంటుందని వేచి చూడాల్సిందే. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు కనిపించేది డిసెంబర్‌లోనే.

దాదాపు 1,500 వస్తువులను, సర్వీసులను రెండు స్లాబ్‌ల్లో కుదిస్తే చిన్న వ్యాపారులు తమ బిల్లింగ్ విధానాన్ని, సాఫ్ట్‌వేర్‌ను మార్చుకోవడం పెద్ద పనే. దీపావళి బొనాంజా మధ్యతరగతికి మోదం కల్పించవచ్చు. సిమెంట్ ధరలు తగ్గి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వవచ్చు. అయితే జీఎస్టీలో వచ్చిన మార్పు వెంటనే కనిపించకపోతే వినియోగదారుడు పెదవి విరుస్తాడు. వ్యాపారులు సరుకుల్ని అక్రమంగా నిలువ చేసి నల్ల బజారుకు తరలిస్తే ప్రయోజనం శూన్యం.

రాష్ట్రాలను కలుపుకుపోయి ప్రధాని చెబుతున్న ‘ఒక దేశం, ఒక ట్యాక్స్’ విధానాన్ని అవాంతరాలు లేకుండా అమలు చేసినపుడే దేశ ఆర్థిక విధానం ఒక గాడిలోకి వస్తుంది.దేశ జీడీపీపై ప్రభావం చూపనున్న ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు వినియోగదారుడి కొనుగోలు శక్తి పెరిగేలా జీఎస్టీ సరళీకృత విధానం ఉంటుందని దీపావళి బొనాంజా హామీ ఇచ్చేనా?