calender_icon.png 20 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపులకు అంతమెప్పుడు?

19-08-2025 12:00:00 AM

మేకల ఎల్లయ్య :

* పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక శాసనసభ్యుడు తన పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే లేదా పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుంది. 

‘ప్రజలు ఓటేశారని నమ్మకం.. కానీ పదవిలో ఉండాలంటే పార్టీ మారాలన్నా రాజీ పడాలా?’.. నేటి భారత రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఈ ప్రశ్న ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే పెకిలిస్తోంది. ప్రజల తీర్పును తుంగలో తొక్కి, నైతిక విలువలను కాలరా స్తూ జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు దేశ రాజకీయాలకు మాయని మచ్చగా మి గిలిపోతున్నాయి. తెలంగాణ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ ప్రజాస్వామ్య అపహాస్యం నిత్యకృత్యమైంది.

పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టం) ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక శాసనసభ్యు డు తన పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే లేదా పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుం ది. అయితే ఈ చట్టంలో పొందుపరిచిన కొన్ని మినహాయింపులు, ముఖ్యం గా ‘దళ విభజన’, ‘విలీనం’ అనేవి పెద్ద లూప్‌హోల్స్‌గా మారిపోయాయి.

2003 లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘దళ విభజన’ నిబంధన తొలగించినా, ‘విలీనం’పై స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అనే నిబంధన కొనసాగుతోంది. ఇదే ఫిరాయింపుదారులకు రక్షణ కవచంగా మారిపోయింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ల పాత్ర వివాదాస్పదంగా మారింది.

అనేక రాష్ట్రాల్లో స్పీకర్లు ఫిరాయింపుదారులపై నిర్దిష్టంగా చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తూ, వారు తమ పదవుల్లో కొనసాగడానికి మార్గం సుగమం చేస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.

ప్రజల ఓటును వ్యాపారంగా?

ప్రజలు తమ ఓటును ఒక పార్టీకి మా త్రమే కాకుండా, ఒక అభ్యర్థికి, అతని నిబద్ధతకు, సిద్ధాంతాలకు వేస్తారు. కానీ ఎన్నికై న అభ్యర్థులు రూ. పది కోట్ల నుంచి యా భై కోట్ల రూపాయల ఆఫర్లతో వేరే పార్టీకి మారడం ప్రజాస్వామ్యానికి మాయని మ చ్చ. ఇది కేవలం వ్యాపారంగా మారిందని, ప్రజాభిప్రాయాన్ని కొనుగోలు చేయడమేనని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేష కులు దుయ్యబడుతున్నారు. ప్రజలకు ఇది ‘నైతిక ద్రోహం’ అని, పాలక వ్యవస్థలో స్థిరత్వానికే ఇది ప్రమాదమని హెచ్చరిస్తు న్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలు అత్యంత కీలక దశకు చేరుకున్నాయి. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారడం రాష్ర్టవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిని ‘ఫిరాయింపు’ గా బీఆర్‌ఎస్ అభివర్ణించి, వారిపై అనరత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిం ది. అయితే 2025 జూలై నాటికి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో, బీఆర్‌ఎస్ న్యాయపరమైన పోరాటం మొదలుపెట్టింది.

ఈ అంశంపై 2025 జూలై 31న సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పునిచ్చింది. ‘స్పీకర్ మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలి’ అని స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెం తీర్పును కొట్టేస్తూ, స్పీకర్‌కు నిర్దిష్ట గడువులపై సూచనలు ఇవ్వడం కోర్టు అధికార పరిధిలోనే ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 64 గెలిచిన సీట్లతో పాటు ఒక ఉపఎన్నికతో కలుపుకొని 65 ఉండగా, బీఆర్‌ఎస్ 39 స్థానాలతో గెలిచి పది మంది పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో దాని బలం సుమారు 29కి తగ్గింది. 

పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు..

దేశంలో పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కాదు. గత కొన్నేండ్లుగా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారా యి. ఆంధ్రప్రదేశ్‌లో 2014--2019 మధ్య కాలంలో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి మారినా స్పీకర్ మూడేండ్లు గడిచినా చర్యలు తీసుకోలేదు. తెలంగాణలో 2014--2018 మ ధ్య టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) లోకి మారగా, 2019లో మరో 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) లో చేరారు.

ఈ రెండు సందర్భా ల్లో స్పీకర్ వాటిని ‘విలీనం’గా పరిగణించి అనర్హత వేటు వేయలేదు. కర్ణాటకలో 2019లో 17 మంది కాంగ్రెస్-, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగా, వారిపై అనర్హత వేటు పడింది. మహారాష్ర్టలో 2022 లో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలు బహిష్కృతులుగా బయటపడి, షిం డే వర్గంగా బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అసలు శివసేన ఎవరు అన్న దానిపై విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో 2016లో దాదాపు మొత్తం కాంగ్రెస్ పార్టీ, 43 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కావడంతో ప్రభుత్వమే మారిపోయింది. గత రెండు దశాబ్దాల గణాంకాలు చూస్తే, సుమారు 400 మందికి పైగా ఎమ్మెల్యేలు, 70 మంది ఎంపీలు పార్టీలు మారారు.

అయితే, వారిలో 40-50 మందిపై మాత్రమే అనర్హత వేటు పడింది. సుమారు 200 మందికి పైగా ‘విలీనం’ అనే లూప్‌హోల్ ఉపయోగించుకొని అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. ఈ గణాంకాలు చట్టపరంగా బలమైన నిబంధనలు ఉన్నప్పటికీ, అమల్లో లోపాలున్నా యని స్పష్టం చేస్తున్నాయి.

ఈసీ, కోర్టులు ఏం చేస్తున్నాయి?

పార్టీ ఫిరాయింపులను నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ అధిక నియం త్రణ లేకపోవడంతో నిష్క్రియంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. వారికి ఉన్న అధికారాలు సరిపోవడం లేదని కొందరు వాదిస్తుంటే, మరికొందరు కమిషన్ చిత్తశుద్ధిపైనే ప్రశ్నిస్తున్నారు.

అయితే సుప్రీంకోర్టు మాత్రం అనేక సందర్భాల్లో తన జోక్యాన్ని చాటుకుంది. 2020లో ‘కర్ణాటక కేసులో’ స్పీకర్లు స్వతంత్రంగా కాకుండా రాజకీయ పార్టీల ప్రయోజనాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని స్పష్టంగా పేర్కొంది. నబాం రబియా వర్సెస్ అరుణాచల్ గవర్నర్ (2016) కేసులో స్పీకర్ పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తే కోర్టు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మహారాష్ర్ట గవర్నర్ కేసులో (2023) శివసేన రెబల్ గ్రూప్‌ను అసలు పార్టీ అనలేమని అభిప్రాయపడింది. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే..

పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన నేపథ్యంలో, కొన్ని కీలకమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముంది. స్పీకర్ నిర్ణయాన్ని తదుపరి స్థాయిలో విచారించే స్వతంత్ర ట్రిబ్యు నల్‌ను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా రాజకీయ ఒత్తిళ్లను తగ్గించి, నిష్పక్షపాత నిర్ణయాలను ఆశించవచ్చు. పార్టీ మారిన వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే పదవి స్వయంచాలకంగా రద్దు అయ్యేలా చట్ట సవరణ తేవాలి.

ఇది ఫిరాయింపుదారులకు బలమైన నిరోధకంగా పనిచేస్తుంది.‘విలీనం’ అనే నిబంధనను దుర్వినియోగం చేయకుండా, దానికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వాలి. ఒక పార్టీ పాక్షికంగా ఉన్నా, దాని శాసనసభ్యులు వేరే పార్టీలోకి వెళ్తే దానిని ‘విలీనం’గా పరిగణించకూడదు. ప్రజల అంగీకారం లేకుండా పార్టీ మారితే.. దాన్ని నేరంగా పరిగణించి, ఆ స్థానానికి ప్రత్యేక ఉప ఎన్నికలు నిర్వహించాలి.

సంస్కరణలు అత్యవసరం..

ప్రజల ఓటు నిబద్ధత, విశ్వాసానికి సంకేతం. దాన్ని వ్యాపారంగా మార్చితే ప్రజాస్వామ్యమే వ్యర్థమవుతుంది. పార్టీలో మార్పులు జరగొచ్చు కానీ ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టి పదవుల వ్యాపారం చేయడాన్ని నిరోధించేందుకు దేశానికి కొత్త చట్టాలు, న్యాయపరమైన సంస్కరణలు అత్యవసరం. రాజ్యాంగం మీద గౌరవం ఉందా? లేక రాజకీయ లాభం కోసమే పదో షెడ్యూల్‌ను కవచంగా వినియోగించుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి. ప్రజల తీర్పే నిజమైన గెలుపు అని, పార్టీ మారితే ప్రజల అభిమతాన్ని మళ్లీ అడగాల్సిందేనని నాయకులు గుర్తించాలి. అప్పుడే భారత ప్రజాస్వామ్యం పరిపూర్ణంగా వర్ధిల్లుతుంది.

వ్యాసకర్త సెల్ : 9912178129